నేను.. మీ శిరోధైర్యాన్ని! | Safety Guidelines: Helmets | Sakshi
Sakshi News home page

నేను.. మీ శిరోధైర్యాన్ని!

Dec 9 2025 8:34 AM | Updated on Dec 9 2025 8:34 AM

Safety Guidelines: Helmets

నా మాట విని.. నన్ను ధరించండి... 

రక్షణతో పాటు రొక్కం కూడా మిగులుతుంది  

చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా రూ.3.50 కోట్లు  

పదకొండు నెలల్లో 9,540 కేసులు  

కర్నూలు: నాకే బాధేస్తోంది... ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరును పోలీసులు విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు కనిపించకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా.. ఇంతకూ నేనెవరనేగా... ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్‌ను. మీ ప్రాణం విలువ మీ కంటే నాకే బాగా తెలుసు. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. 

ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా తీరు మార్చుకోకపోవడంతో ఎంతో బాధ కలుగుతోంది. అనాలోచిత చర్యల ద్వారా జరిగిన ప్రమాదాల్లో యువకులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పెళ్లి కాని వారు కొందరు ఉంటే పెళ్లయి ఏడాది, రెండేళ్లకే అనంత లోకాలకు చేరినవారు మరికొందరు. ఇందులో ఏ ఒక్కరూ నా విలువను గుర్తించినా నేడు వారి కుటుంబీకులతో ఆనందంగా ఉండేవారు. ఇప్పటికైనా మీరు మారండి.. నా మాట వినండి.. నన్ను తలకెక్కించుకోండి.  

తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే...  
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ప్రమాదం జరిగినప్పుడు అది ఊగి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించే ఐఎస్‌ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తల దెబ్బ తగలకుండా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. మీ శరీర భాగంలో నేను అండగా ఉండే తలే కీలకం. ఇందులోనూ మెదడు చాలా సున్నితమైంది. దెబ్బ తగలకుండా నేను కాపాడతా.. అందుకే నన్ను ధరించండి.. ధైర్యంగా ఉండండి. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. నేను రక్షగా ఉంటే జుట్టు కాలుష్యం బారిన పడదు. జుట్టు ఊడుతుందన్న భయంతో మహిళలు నన్ను ధరించేందుకు వెనుకాడుతుంటారు. ఇది తగదని గుర్తుంచుకోండి. ముఖం పూర్తిగా కప్పి ఉంచేవి వాడటం వల్ల తలకు, ముఖానికి రక్షణగా ఉంటా.  

చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా? 
నన్ను వినియోగించకపోవడం వల్ల పోలీసులు జిల్లాలో 9,540 కేసులు నమోదు చేశారు. అపరాధ రుసుం రూపంలో పదకొండు మాసాల కాలంలో మీరు రూ.3.50 కోట్లు మూల్యం చెల్లించారు. నన్ను ధరిస్తే రక్షణతో పాటు సొమ్ము కూడా మిగులుతుందన్న  వాస్తవాన్ని గ్రహించుకోండి. 

 ఇట్లు... మీ హితం కోరే హెల్మెట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement