చలి వాతావరణంతో గుండెపై అదనపు ఒత్తిడి
నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15–20 శాతం అధికం
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిక
జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు
సాక్షి, అమరావతి: చలికాలం అనారోగ్య సమస్యలకు పుట్టినిల్లు లాంటిది. వైరస్, బ్యాక్టీరియల్ జబ్బులతో పాటు గుండెజబ్బుల ముప్పు చలికాలంలో ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో సాధారణ రోజుల్లో ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ముప్పు 50 శాతం అధికంగా ముప్పు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నవంబర్–ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15–20 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మిగిలిన రోజులతో పోలిస్తే చలి వాతావరణం రోజుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14–20 శాతం అధికంగా ఉంటుంది. ఈ సమస్య హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌లకు, గుండె వైఫల్యానికి కారణమవుతుంది. చలితీవ్రతకు శ్వాసనాళాలతో పాటు గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండె ఎక్కువగా శ్రమించాల్సి వచ్చి, అదనపు ఒత్తిడి పడుతుంది.
ఈ సమస్య వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి ఉంటే 40 ఏళ్లలోపు వారిలోను గుండె ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో రక్తంలో కెటాకెలోమిన్స్ హార్మోన్ స్థాయి పెరిగి, రక్తనాళాల్లో అప్పటికే పూడికలు ఉంటే అక్కడ రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు.
చలిని తట్టుకోవడం కోసం కొందరు అధికంగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు. ఇది గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీవ్యవస్థపై దు్రష్పభావం చూపి గుండె లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుని హార్ట్ అరిథ్మియాకు దారితీస్తుంది.
వీరు జాగ్రత్త
» ఇప్పటికే గుండె జబ్బులున్నవారు
» బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
» ధూమపానం, మద్యపానం చేసేవారు
» కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు
» ఊబకాయం, నిత్యం ఒత్తిడితో బాధపడేవారు
» రక్తంలో చెడు కొలె్రస్టాల్ ఎక్కువగా ఉన్నవారు
ఈ లక్షణాలుంటే అశ్రద్ధ వద్దు
» ఛాతీ మధ్య, పైభాగంలో నొప్పి
» ఛాతీ పట్టేసినట్టు, బరువుగా అనిపించడం
» శ్వాస తీసుకోవడం కష్టతరం కావడం
» చలిలోను చెమటలు పట్టడం
శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూడాలి
చలికాలం కాబట్టి సాధారణంగా అందరూ తక్కువగా నీరు తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వ్యక్తుల్లో రక్తం చిక్కబడి క్లాట్‌లు వస్తాయి. చలికి రక్తనాళాలు సైతం కుంచించుకుపోయే అవకాశం ఉండటంతో గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తపడాలి.
జీవనశైలి మార్చుకోవాలని కొందరు కొత్తగా వ్యాయామాలు ప్రారంభిస్తుంటారు. అలాంటివారు తొలుత వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తెలుసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలున్నవారు శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, విభాగాధిపతి, కార్డియో వాసు్క్యలర్ సర్జరీ, కర్నూలు జీజీహెచ్


