సాక్షి, తూర్పుగోదావరి: పవన్ కల్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. కోనసీమకు తెలంగాణ ‘దిష్టి’ తగిలిందన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. శనివారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీగా పెట్టుబడులు తెస్తానంటున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీలో ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదు.. అన్ని వేల ఎకరాలు ఎందుకనేదే నా ప్రశ్న’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.
కాగా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తనను బాధించాయని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు. పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


