సాక్షి, అమరావతి: రెండవ విడత భూ సమీకరణ పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, రిటైర్డ్ ఫ్రొఫెసర్ - డా.సి.రామచంద్రయ్య, రాష్ట్ర అభివృద్ధి కమిటీ సామాజిక కార్యకర్త వసుంధర, అమరావతి రైతు బుచ్చి తిరుపతిరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు, వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. లోగడ భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదు. మళ్లీ రెండో విడత భూ సమీకరణ పేరుతో భూములు తీసుకోవడం సరికాదు. అమరావతి రైతుల పై పెట్టిన కేసులు ఇంకా ఎందుకు తీసేయలేదు. చంద్రబాబు పగటి కలల కోసం కోట్లాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. 24 ప్లాట్ ఫామ్‌లతో రైల్వేస్టేషన్ కడతానంటున్నాడు. రెండు లక్షలు జనాభా కూడా లేని అమరావతికి అంత పెద్ద రైల్వేస్టేషన్ అవసరమా. 5వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నారు. 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ కడతానంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా?
చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అమరావతి వ్యయం ఎక్కడికి వెళుతుందో అనే భయం కలుగుతోంది. ఐకానిక్ బ్రిడ్జిల పేరుతో హంగామా చేస్తున్నాడు. బ్రిడ్జిల నిర్మాణం అంటే పంట కాలువల పై చెక్క వంతెనలు కట్టినంత సులభం అనుకుంటున్నాడు. మన జనాభా ఎంత...అప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు అవసరమా అంటూ ఆయన చంద్రబాబుపై మండిపడ్డాడు.


