నా నలుగురు ఆడ పిల్లల్లో ఒక్కరికీ రాలేదు
పీటీఎంలో ఎమ్మెల్యే పంతం నానాజీకి ఓ తల్లి కష్టాలు ఏకరువు
కరప: నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. అంటూ పిల్లలు ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేసి ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేరలేదంటూ ఓ తల్లి మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో ఏకరువు పెట్టింది. కాకినాడ జిల్లా కరపలోని నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పీటీఎం సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరప నక్కావారి ఎస్సీ వీధికి చెందిన కుడిపూడి శాంతి మాట్లాడుతూ.. తనకు ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు పుట్టారని, వారు ప్రస్తుతం కరప హైసూ్కలులో 8వ తరగతి చదువుతున్నారని, తల్లికి వందనం పథకంలో వారికి రూ.60 వేలు రావాల్సి ఉండగా, ఒక్కరికి కూడా రాలేదన్నారు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నానాజీ చెప్పుకొచ్చారు.


