విజయవాడ లీగల్: పోలీసులు తనను అరెస్టుచేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించకుండా అరెస్టుచేశారని కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఎ–9 నిందితుడు యర్రంశెట్టి రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు చేశారు. హైవేల మీద ఏలూరు, భీమడోలు వంటి ప్రాంతాల్లో తిప్పారని.. ఒక హోటల్‌లో బంధించి, అర్ధరాత్రి 11 గంటల తర్వాత కళ్లకు గంతలు కట్టి అక్కడ నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనను ఓ గదిలో బంధించి, కనీసం భోజనం, మంచినీరు కూడా ఇవ్వకుండా హింసించారని ఆయన చెప్పారు.
గంజాయి కేసుతోపాటు అనేక కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ తప్పుడు స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుని బలవంతంగా కొన్ని కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని రామాంజనేయులు ఆరోపించారు. అయితే, శుక్రవారం ఉ.11 గంటలకల్లా న్యాయస్థానంలో హాజరుపరచాల్సి ఉండగా, సా.3 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు ఆయన తరఫు న్యాయవాది సత్యశ్రీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రామాంజనేయులును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణాధికారి ఏసీపీ దామోదర్ నుండి వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి పి. భాస్కరరావు ఆదేశాలు జారీచేస్తూ, రామాంజనేయులును ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
బలవంతంగా తీసుకెళ్లారు: మరోవైపు.. రామాంజనేయులును గురువారం ఉ.11 గంటలకు కేసరపల్లిలోని ఆయన నివాసానికి కొందరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, కేసు విచారణ నిమిత్తం రావాల్సిందిగా అతనిని ఓ ప్రైవేటు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, వచ్చిన వారి సమాచారం తమకు ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో పట్టుకెళ్లారని వారు చెప్పారు.


