గొంతు పిసికి.. చెవి కమ్మలు లాక్కున్న వైనం
ఒంగోలులో రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు
ఒంగోలు టౌన్: చంద్రబాబు సర్కారు పాలనలో రాష్ట్రంలో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. అవసరమైనవారికి ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి.. వసూళ్ల కోసం హింసిస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అప్పు తీసుకున్న మహిళపై దాడిచేసి స్తంభానికి కట్టేసి కొట్టారు. సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ, పోలీసుల కథనం ప్రకారం.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వితంతు దళిత మహిళ దార్ల మాధురి ఒంగోలు నెహ్రూనగర్‌లో నివసిస్తోంది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది.
కుటుంబ అవసరాల కోసం మాధురి.. నెహ్రూనగర్లో వడ్డీ వ్యాపారం చేస్తున్న సురేఖ వద్ద రూ.100కు 10 రూపాయల వడ్డీ ప్రకారం రూ.20 వేలు అప్పు తీసుకొంది. మూడునెలల పాటు నెలనెలా రూ.2 వేల వంతున వడ్డీ చెల్లించింది. బుధవారం రాత్రి సురేఖ, ఆమె సోదరి శాంతి కలిసి మాధురి ఇంటికి వచ్చారు. వడ్డీ డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేశారు. దౌర్జన్యంగా మంచం మీద పడేసి గొంతుపిసికారు. చెవి కమ్మలను బలవంతంగా లాక్కున్నారు. మాకు ఒంగోలు పోలీసులు, రౌడీలు తెలుసు.. నీ అంతు చూస్తాం.. అంటూ బెదిరించారు. మాధురి ఇంటిలోని సామాన్లన్నిటినీ చెల్లాచెదురు చేశారు. జుట్టుపట్టుకొని బయటకు లాక్కెళ్లి ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టారు. కాలనీవాసులు కొందరు సురేఖను, శాంతిని అడ్డుకున్నారు. దీంతో మాధురి చేత ఖాళీ ప్రామిసరీ నోట్లమీద సంతకాలు తీసుకుని వెళ్లిపోయారు.


