3.0 సమయం వృథా..!
మెగా పేటీఎంకు స్పందన అంతంతే ఖర్చు కొండంత.. విదిల్చింది గోరంత ప్రధానోపాధ్యాయులపై ఆర్థిక భారం అధికారుల దృష్టికి పలు సమస్యలు తల్లిదండ్రుల నుంచి స్పందన అంతంతమాత్రమే చాలా చోట్ల 20 శాతం కూడా హాజరు కాని వైనం వారం రోజులుగా తరగతులకు దూరమైన ఉపాధ్యాయులు జిల్లాలో 2409 స్కూళ్లలో మొక్కుబడిగా సమావేశాలు
ఒంగోలు సిటీ:
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. జిల్లాలో 2409 స్కూళ్లు ఉండగా దాదాపు 80 శాతం స్కూళ్లలో తల్లిదండ్రుల హాజరు శాతం 20కి మించలేదంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తమ పిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశాలతో సమయం వృథా తప్ప విద్యార్థులకు జరిగే మేలు శూన్యమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
హెచ్‌ఎంకు ఆర్థిక భారం...
ఈ సమావేశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు ఆర్థిక భారంగా మారింది. 150 మంది విద్యార్థుల సంఖ్య దాటిన స్కూళ్లకు ప్రభుత్వం రూ.4,500 ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆయా స్కూళ్లలో నిర్వహణ ఖర్చు సుమారు రూ.20 వేలు దాటుతోందని ప్రభుత్వం ఇచ్చేది ఒక మూలకు సరిపోదని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. తొలిసారిగా నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వం అరకొరగా నిధులు విదిల్చింది. రెండో దఫా నిర్వహించిన సమావేశాలకు మాత్రం స్కూళ్ల నిర్వహణ పద్దు నుంచి సమావేశాలు బిల్లులు తీసుకోవాలని జిల్లా అధికారులు హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. శుక్రవారం నిర్వహించిన సమావేశాలకు సంబంధించి జిల్లాలోని స్కూళ్లకు డబ్బులు అందలేదు. హెచ్‌ఎంలు తమ జేబుల్లోంచి కొంత, దాతల దగ్గర నుంచి మరికొంత విరాళాలు సేకరించినట్టు సమాచారం.
వారం రోజులుగా పాఠాలకు దూరం..
రానున్నది పరీక్షల సీజన్. ఈ సమయంలో పేరెంట్, టీచర్ సమావేశాలు నిర్వహించడం సబబు కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలను ఆర్భాటంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. సమావేశానికి సంబంధించిన పనులు చేయడం, వాటి స్థితిని ప్రతిరోజు ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయడంతోనే సరిపోయిందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. శనివారం నుంచి పదో తరగతి విద్యార్థులకు రివిజన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ సమావేశాల వల్ల రివిజన్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదన్న ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ వరుస వర్షాలు కురిశాయి. దీంతో సమావేశాలను మైదానాలను సిద్ధం చేసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కష్టపడాల్సి వచ్చిందని తెలిసింది.
● మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో పాఠశాలలో సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ కమిటీ మీటింగుల్లో తమ పిల్లలు ఆటలాడేందుకు ప్లే గ్రౌండ్ కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీసీ హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. పొదిలి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని పేరెంట్స్ విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలకు మీ తల్లిదండ్రులు కచ్చితంగా హాజరుకావాలని పలుచోట్ల ప్రధానపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. పొదిలి మండలంలోని ఉప్పలపాడు హైస్కూల్‌లో జరిగిన మీటింగుకు పలువురు వృద్ధులు హాజరయ్యారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్లు హైస్కూల్లో 500 మంది విద్యార్ధులకు గానూ సుమారు 150 మంది పేరెంట్స్ హాజరయ్యారు.
● కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సుమారు మూడు గంటలకు భోజనం పెట్టడంతో ఇబ్బంది పడ్డారు. రెచ్చంపాడు మండలం సీతారాంపురంలో నాడు–నేడు పనులు పూర్తి చేయాలని తల్లిదండ్రులు అడిగారు. పలు పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 10 శాతం మంది మాత్రమే తల్లిదండ్రులు హాజరయ్యారు.
● యర్రగొండపాలెం గవర్నమెంట్ హైస్కూల్లో 800 మంది విద్యార్థులు ఉండగా కేవలం దాదాపుగా 90 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. పేరెంట్స్ కంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల సంఖ్యే ఎక్కువగా ఉంది.
● కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం కొణిజేడులో నిర్వహించిన కార్యక్రమం రాజీ సమావేశాలను తలపించింది. ఈ ఉన్నత పాఠశాలలో 145 మంది విద్యార్థులు ఉండగా కేవలం 60 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఈ సమావేశం రాజకీయ సభగా మారిపోయింది. ఇక మంత్రి స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉండగా 50 మంది తల్లిదండ్రులు హాజరు కావడం గమనార్హం.
● పొన్నలూరు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం డబ్బులు అరకొరగా పడినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి హాజరైన నాయకులు, అధికారులను ప్రశ్నించారు.
3.0 సమయం వృథా..!


