బెత్తెడు జీతంతో వీఆర్‌ఏల బండచాకిరి
ఏ ఒక్క సమస్య పరిష్కరించని చంద్రబాబు ప్రభుత్వం వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో వీఆర్‌ఏలు శ్రమదోపిడీకి గురవుతున్నారని, బెత్తెడు జీతంతో బండచాకిరి చేస్తున్నా కుటుంబాన్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వీఆర్‌ఏలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కనీసం ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కనీస వేతనాలను అమలు చేస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మాటతప్పారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంగా ఒక్క రూపాయి కూడా వీఆర్‌ఏలకు జీతాలు పెంచకపోగా వారితో బండచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నారని, పే స్కేలు అమలు చేయడంతో అక్కడ రూ.20 వేలకు పైగా వేతనాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం పే స్కేలు ఊసే లేదన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా పే స్కేలు పెంచాలని డిమాండ్ చేశారు. అటెండర్, నైట్ వాచ్‌మెన్‌లకు 70 శాతం పే స్కేలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వీఆర్‌ఏలు పదోన్నతులకు నోచుకోకుండా నిరాశకు గురవుతున్నారని, ఎప్పటికీ వీఆర్‌ఏలుగానే మిగిలి పోవాలా అని ప్రశ్నించారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయోభారం పెరుగుతోందని, రిటైర్‌మెంట్ నాటికై నా ప్రమోషన్లు ఇస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించడంలేదని చెప్పారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్‌ఏలను అకలి బాధల నుంచి కాపాడాలని కోరారు. వేతనాలు పెంచకుండా, ఖాళీలను భర్తీ చేయకుండా వీఆర్‌ఏలకు డ్రైవర్లుగా, నైట్‌వాచ్‌మెన్‌లుగా అక్రమంగా డ్యూటీలు వేస్తున్నారని ఆరోపించారు. వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షుడు గంటినపల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్ పోస్టులను వీఆర్‌ఏల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు పి.జ్యోతి అధ్యక్షత వహించగా సోములు, చంద్ర, నాగేంద్ర, సుందర్ రావు, శివయ్య పాల్గొన్నారు.


