స్క్రబ్ టైఫస్ జ్వరాలకు ఆందోళన పడొద్దు
ఒంగోలు టౌన్: స్క్రబ్ టైఫస్ జ్వరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సౌరబ్ గౌర్ చెప్పారు. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్‌తో కలిసి శుక్రవారం రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్లతో ఆయన మాట్లాడారు. స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబొరేటరీల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ బోధనాస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో 7 వీఆర్డీఏ ల్యాబులు ఉన్నాయన్నారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు, రీయేజంట్లను ఆస్పత్రులకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లమచ్చ కనిపించి జ్వరం వస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయన్నారు. వర్షాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు. జ్వరంతోపాటుగా తలనొప్పి, శరీరంపై కీటకం కుట్టిన చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నట్లు గమనించామన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు కుట్టడం వలన ఈ వ్యాధి సోకుతుందన్నారు. స్క్రబ్ టైఫస్ జ్వరాలకు వైద్య చికిత్సకు అవసరమైన డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ ఔషధాలను ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో తీసుకున్నట్లుగానే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వ్యక్తులు మరిన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ పద్మప్రియ, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు శ్రీదేవి, చిన్నపిల్లల వైద్య నిపుణులు తిరుపతి రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ పద్మలత పాల్గొన్నారు.


