కోటి సంతకాలతో కనువిప్పు కావాలి
సూరేపల్లి, సీతానాగులవరం కోటి సంతకాల సేకరణలో అన్నా రాంబాబు
తర్లుపాడు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం రాత్రి తర్లుపాడు మండలంలోని సూరేపల్లి, సీతానాగులవరం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, వైద్య విద్య, అర్హులైన వారికి అందాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలు నిర్మించాలని, అందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని అన్నా రాంబాబు కోరారు. నాడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించి ప్రజల మనసుల్లో నిలిచిపోయాడని, ఆయన స్థానాన్ని ఎవరూ తొలగించలేరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్థులను తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసమే కోటి సంతకాల ఉద్యమం చేపట్టామన్నారు. 66 ఏళ్లపాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్యం కోసం గతంలో లాగా ఒంగోలు, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వలన పేదలకు ఉచితవైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. 3500 మెడికల్ సీట్లు రాష్ట్రానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. రాజకీయ విమర్శల కోసం, ఓట్ల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, భవిష్యత్ తరాల కోసమే అన్నారు. పేద వారి చదువు, వైద్యం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ప్రవేశ పెడితే ఆయన తనయుడు అమ్మఒడి పథకాన్ని పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అన్నా రాంబాబుకు నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ వెన్న ఇందిర, మార్కాపురం, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, పీ చెంచిరెడ్డి, సర్పంచ్ నవ్య రమణయ్య, ఎంపీటీసీ రేగుల సాలమ్మ, పార్టీ నాయకులు అంకయ్య, సర్పంచ్‌లు ఆంజనేయులు, దాసయ్య, ఎంపీటీసీ అంకయ్య ఆధ్వర్యంలో అన్నాకు ఘనస్వాగతం పలికారు.


