వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.42లక్షలతో నిర్మించిన పీఆర్ వసతి గృహం, అప్పటి ఆర్థిక మంత్రి భవనాన్ని ప్రారంభించిన శిలాఫలకం (ఫైల్)
డోన్: టీడీపీ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ సంస్కృతిని చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలూ కొనసాగిస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం ఇదే బాటను అనుకరించారు.
వివరాల్లోకెళ్తే.. నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని 2024 జనవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఇప్పుడు ఆ భవనాన్ని తామే నిర్మించామంటూ చంద్రబాబు సర్కార్‌లోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయంగా ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ ప్రారంభకులుగా, సభ అధ్యక్షులుగా డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ఫరూక్‌లు పాల్గొన్నట్లు కొత్త శిలాఫలకాన్ని వేయించారు. ఇది చూసిన స్థానికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారాలు చేసుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
భవనం వద్ద రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించినట్లు స్పష్టంగా శిలాఫలకం కనిపిస్తోంది. అయినప్పటికీ నిస్సిగ్గుగా ఇలా క్రెడిట్ చోరీ చేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.


