సినిమా షూటింగ్‌ను తలపించిన మెగా పీటీఎం
క్లాస్‌రూమ్ సెట్టింగ్‌లో పక్కా స్కిట్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ షో
ముందుగా ఎంపిక చేసిన వారికే మాట్లాడే అవకాశం
స్కూల్ కమిటీ చైర్మన్‌కు వేదికపై చోటు దక్కని వైనం
గత ప్రభుత్వ నాడు–నేడు ఆనవాళ్లు కనిపించకుండా అలంకరణ
విద్యా రంగాన్ని దిగజార్చి.. మళ్లీ పీటీఎంలా?
మెగా పీటీఎం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్న వైనం
ప్రచార యావ తప్ప ప్రగతిని విస్మరించిన సీఎం చంద్రబాబు
నాసిరకంగా మధ్యాహ్న భోజనం.. నాణ్యత లేని స్టూడెంట్ కిట్లు
అటకెక్కిన డిజిటల్ విద్యా బోధన.. సబ్జెక్టు టీచర్ కాన్సెప్‌్టకు మంగళం
టోఫెల్, సీబీఎస్‌ఈ రద్దు.. ఐబీ బోధన నిలిపివేత
తొలి ఏడాది పూర్తిగా తల్లికి వందనం ఎగవేత.. రెండో ఏడాది అరకొర
వైఎస్ జగన్ సర్కార్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లు పాల్గొన్న మెగా పేరెంట్–టీచర్ సమావేశం అచ్చం సినిమా షూటింగ్‌ను తలపించింది. దర్శకుడు మైక్ పట్టుకుని క్లైట్ ప్లీజ్.. స్టాండ్ బై.. యాక్షన్.. కట్.. అన్నట్లు ఆద్యంతం పక్కా స్కిట్‌గా నడిచింది. ముఖ్యమంత్రి ఈ పాఠశాలకు వస్తున్నారని తెలియడంతో ప్రత్యేకంగా సెట్ వేశారు. పిల్లలతో ముందుగా అనుకున్న ప్రకారం కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఓ వర్గం మీడియాను మాత్రమే లోపలికి అనుమతించారు. ఏం మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలి.. అన్న దానిపై కొందరిని ముందుగానే ఎంపిక చేసి, రిహార్సల్ చేయించి మాట్లాడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జ్ అద్భుతంగా ఉందని.. త్వరలో వాళ్ల నుంచి తాను నేర్చుకునే రోజు వస్తుందని చెప్పారు. ప్రస్తుత విద్యా విధానం బాగుందన్నారు.
గతంలో చాలా యాప్‌లు ఉండేవని.. ఇప్పుడు అలాంటి ఇబ్బందులని్నంటినీ తొలగించామని తెలిపారు. స్టూడెంట్స్ ఇన్నో వేటర్స్ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏర్పాటు చేస్తామని, వంశధార–పోలవరంను అనుసంధానించి ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ లీప్ యాప్ గురించి ఎవరికీ తెలియదని చెప్పారు. కాగా, స్కూల్ కమిటీ చైర్మన్ రవి కుమార్ వైఎస్సార్‌సీపీకి చెందిన వారని వేదికపై స్థానం కల్పించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.65 లక్షలతో నాడు–నేడు కింద సమకూర్చిన వసతుల ఆనవాళ్లు కనిపించకుండా అలంకరణ చేయడం చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తుపోయారు.
విద్యా రంగాన్ని దిగజార్చి.. మళ్లీ పీటీఎంలా?
సాక్షి, అమరావతి: సాధారణంగా సినిమా షూటింగ్‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లకు సెట్టింగ్‌లు వేయడం చూస్తాం.. కానీ పిల్లలు చదువుకునే పాఠశాలలోనే ఏకంగా సెట్టింగ్ వేసి చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. అక్కడ పీటీఎం నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. అధికారంలోకి వచి్చన నాటి నుంచి గత 19 నెలలుగా సర్వం భ్రష్టు పట్టించి విద్యా సంస్కరణలను చంద్రబాబు నీరుగార్చారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈవెంట్లు నిర్వహిస్తుండటం పట్ల తల్లిదండ్రులు, విద్యావేత్తలు విస్తుపోతున్నారు.
అసలు చంద్రబాబుకు విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది? ఆయన రాగానే స్కూళ్లలో నాడు – నేడు నిలిపివేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఆయన ఒక్కటీ చేయకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాఠశాలల్లో నాడు – నేడు ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడితే దాన్ని కొనసాగించకుండా నిలిపివేశారు.
విద్యా సంస్కరణలన్నింటినీ ఆపివేశారు. గోరుముద్దను ఘోరంగా మార్చేశారు. టోఫెల్ లేదు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. ట్యాబ్‌లు కనుమరుగు.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్‌ఈ రద్దు.. హైస్కూల్ ప్లస్‌లు రద్దు.. ఆయాలకూ జీతాలు ఇవ్వడం లేదు.. కనీసం పిల్లలకు తాగునీటిని కూడా సమకూర్చడం లేదు.. ఫిల్టర్లు కూడా మార్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.. రాష్ట్రంలో 29 మంది పిల్లలు చనిపోయిన దుస్థితికి విద్యా రంగాన్ని దిగజార్చి.. మళ్లీ పీటీఎంల పేరుతో ఈవెంట్ల నిర్వహణ ఏమిటని తల్లిదండ్రులు, విద్యావేత్తలు చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు.
తొలి ఏడాది పూర్తిగా తల్లికి వందనం ఎగ్గొట్టడమే కాకుండా రెండో ఏడాది అరకొరగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తే, చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని అన్ని చోట్లా పీటీఎం సమావేశాల్లో చర్చించుకున్నారు.


