సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి.. నగరంలోని గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) శుక్రవారం అడవివరం వచ్చారు. వారు స్థానిక పోస్టాఫీసు వీధిలోని సిరిచందన కల్యాణమండపం అనుబంధ గదుల్లో(లాడ్జి) ఒకటి అద్దెకు తీసుకున్నారు. వారు గదిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు.
రాత్రి 8.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ సీఐ ఎల్.ఎస్.నాయుడు, సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. తల్లీకొడుకులు ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్‌కు చెందినవారని, వారిని తల్లీకొడుకులుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గయప్పాంజన్ టీసీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2023లో నాంపల్లి స్టేషన్‌లో గయప్పాంజన్‌పై కేసు పెట్టింది.


