నాలుగొచ్చినా.. నరక‘వేతన’ జీతమేది బాబూ? | Chandrababu Coalition govt Neglected government employees salaries | Sakshi
Sakshi News home page

నాలుగొచ్చినా.. నరక‘వేతన’ జీతమేది బాబూ?

Dec 5 2025 3:15 AM | Updated on Dec 5 2025 7:48 AM

Chandrababu Coalition govt Neglected government employees salaries

ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే చెల్లింపు ఒకనెల ముచ్చటే

విడతల వారీగా చెల్లించే తంతుగా మార్చేసిన సర్కారు  

మంగళవారం రూ.3,000 కోట్లు అప్పు తెచ్చినా ఫలితం శూన్యం

ప్రభుత్వ ఉద్యోగుల హాహాకారాలు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఈ నెల 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు జమ చేయలేదు. కలెక్టరేట్లు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ జీతాలు పడలేదు. వ్యవసాయ, జలవనరు­లు, పంచాయతీరాజ్, సమాచార, ప్రణాళికా శాఖలో పని చేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితంగా వారు రుణ వాయి­దాల చెల్లింపులు.. పిల్లల ఫీజులు, ఖర్చులకు నరకయాతన అనుభవిస్తున్నారు. 3వతేదీన అరకొరగా కొన్నిశాఖల్లో అదీ అతికొద్దిమందికి మాత్రమే జీతాలు జమైనట్టు సమాచారం. దీంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వేతనాలు చెల్లింపులను విడతల వారీ తంతుగా చంద్రబాబు సర్కారు మార్చేసిందని మండిపడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని గత ఎన్నికల ముందు ప్రతిసభలోనూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీ చెల్లించారని, ఆ తర్వాత పూర్తిగా చతికిలపడ్డారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతితక్కువ గౌరవ వేతనాలు తీసుకునే ఉద్యోగులకూ సర్కారు చెల్లింపులు చేయలేకపోతోందని ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రూ.3000 కోట్లు అప్పు చేసినప్పటికీ బాబు సర్కారు జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.   


ఉద్యోగులపై వ్యత్యాసం చూపడమేమిటీ?  
చంద్రబాబు సర్కారు ఉద్యోగులందరూ సమానం కాదనే ధోరణిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల్లో విభజన తీసుకొస్తోందని, అలాగే ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కిన ఉపాధ్యాయులకు 3న జీతాలు జమ చేశారని, మిగతా వారికి చెల్లించలేదని.. ఇలా ఉద్యోగుల్లో విభజన తీసుకురావడం సరికాదని ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.    
చిరుద్యోగులూ ఎదురు చూపే 
కూటమి సర్కారులో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 104  ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్‌ఏలుఏ, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం 10–15వ తేదీ వరకు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులైతే వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.   

జనవరి వస్తే ఐదు డీఏలు పెండింగ్‌ 
డిసెంబర్‌ వచ్చేసింది జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. అయితే ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి అదీ మూడు వాయిదాల రూపంలో చెల్లిస్తామని పేర్కొందని, ఇప్పుడు ప్రతీ నెలా వేతేనాలను కూడా 1వ తేదీన కాకుండా విడతల వారీగా పలు తేదీల్లో చెల్లించే విధానాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  



ఏ నెలా ఒకటినే జీతాల్లేవు 
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను పట్టించుకోవడం లేదని, చులకనగా చూస్తోందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌  కె.వెంకటరామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఏ నెలా  ఉద్యోగులందరికీ 1న జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులు జీతాల కోసం 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వీఆర్‌ఏలు, హోంగార్డులు లాంటి చిరుద్యోగులకూ జీతాలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్‌ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తారని, ఆ గౌరవ వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోడం బాధాకరమన్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఒక తేదీన మరో కొంత మందికి మరో తేదీన జీతాలు చెల్లించడం అనేది ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement