పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది.
శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించడం.. దానిని అంగీకరించి ఆయన హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలను బయటపెట్టింది. పలువురు సీనియర్లు ఆయన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. థరూర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ ఖేడా, జైరాం రమేష్‌లాంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. థూరూర్‌ను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ అంటోంది. ఈ అభ్యంతరాలు.. రాజకీయ విమర్శల దరిమిలా శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.
తిరువనంతపురం(కేరళ) ఎంపీ శశిథరూర్.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ హోదాలోనే తాను కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని అన్నారాయన. ‘‘20 ఏళ్ల క్రితం నేను జియోపాలిటికల్ అలైన్‌మెంట్స్ కోసం అన్వయించిన ఓ పదం.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చినందుకు సంతోషం. రాష్టప్రతి భవన్‌లో గతంలో భిన్నమైన వైఖరి ఉండేది. కానీ, ఈసారి ఇతర గళాలను కూడా వినిపించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందుకే నన్ను ఆహ్వానించి ఉంటారు. అలాగే..
ఇతర దేశాలతో సంబంధాలు మా కమిటీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల అక్కడ జరిగే సంభాషణలు, వాతావరణం గురించి అవగాహన కలగడం మాకూ మంచిదే అని అన్నారాయన. అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందును అద్భుతం(Excellent Dinner) అని అభివర్ణించారు.
ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించారు. ఆయన కోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే అధికారిక కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామంపై థరూర్ స్పందిస్తూ.. ఆ విషయం తనకు తెలీదన్నారు. ఏ ప్రతిపాదికన ఆహ్వానాలు పంపారో తనకు అవగాహన లేదన్నారు. అలాగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం కోరారా? అనే ప్రశ్నకు.. రాష్ట్రపతి భవన్ విందుతో దానికి సంబంధం లేదన్నారు. విందు ముందు జరిగిన సంభాషణల్లో తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ అధికారులతో ప్రస్తావించానని తెలిపారు. “ప్రజల కోసం, ఓటర్ల కోసం పని చేయడం నా రాజకీయ బాధ్యత” అని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాం. ఏకీభవించే చోట కలిసి పనిచేయాలి అని వ్యాఖ్యానించారు.
థరూర్ గతకొంతకాలంగా ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం.. ఆపరేషన్ సిందూర్ కోసం దూతలా ప్రపంచమంతా తిరగడం కాంగ్రెస్‌లో అసంతృప్తికి దారి తీసింది తెలిసిందే. ఈ తరుణంలో.. ఆయనకు పార్టీ మారతారా? అనే ప్రశ్నా తాజా ఇంటర్వ్యూలోనూ ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం’’ అంటూ ఆచితూచి స్పందించారాయన.


