‘పంథా’ పేరుతో పైపూతలు! | Kommineni Srinivasa Rao Comments On Yellow Media Fake News | Sakshi
Sakshi News home page

‘పంథా’ పేరుతో పైపూతలు!

Dec 6 2025 11:32 AM | Updated on Dec 6 2025 12:09 PM

Kommineni Srinivasa Rao Comments On Yellow Media Fake News

‘‘పంథా మార్చిన చంద్రబాబు’’ ఎల్లో మీడియా ఈనాడులో కనిపించిన ఒకానొక శీర్షిక. చూడగానే ఏమనిపిస్తుంది? పరిపాలనకు సంబంధించి ఏదో మేలి మార్పు తీసుకొచ్చారేమో చంద్రబాబు అని కదా? లేదూ.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనం అనుకుంటే రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చెక్‌ పెట్టే చర్యలేవో తీసుకున్నారని అనిపించాలి. కానీ.. కథనం మొత్తం ఒకటికి పది సార్లు చదివినా అర్థమయ్యేది ఏమిటంటే.. బాబుగారిని ఆకాశానికి ఎత్తేయడం ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిన ఎమ్మెల్యేలను బెదిరించడం అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే... పార్టీపై ప్రజా వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన అవసరం లేదంటూ... కార్యకర్త తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు చెప్పారని ఈ కథనంలో పేర్కొన్నారు మరి. 

అక్కడితో ఆగలేదు.. మొదట నాయకులు, కార్యకర్తలు మోటివేట్ అయితే, అధికారులను నియంత్రించడం కష్టం కాదని కూడా బాబుగారు పేర్కొన్నారట. పవిత్ర యజ్ఞానికి ఎవరు విఘాతం కలిగించినా వదలిపెట్టను అని హెచ్చరించారట. ఇంతకీ  చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పవిత్ర యజ్ఞం ఏమిటి? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమా? రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ఇష్టారీతిన, అర్థంపర్థం లేని రీతిలో ఖర్చు పెట్టడమా? చారాణా కోడికి బారా అణా మసాలా అన్నట్టు  రూ.నాలుగు వేలు ఫించన్‌ ఇచ్చేందుకు హెలికాప్టర్‌ వేసుకుని రాష్ట్రమంతా తిరగడమా? తనపై ఉన్న అవినీతి కేసులను తానే మాఫీ చేసుకోవడమా? రైతులు సంక్షోభంలో ఉంటే వాటిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడమా? ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద రూ.6700 కోట్ల బకాయిలు  పెట్టడమా? దాని ఫలితంగా టీడీపికి చెందిన వారి కాలేజీలలోకి సైతం విద్యార్ధులను లోపలికి రానివ్వడం లేదట. 

ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద మూడువేల కోట్ల బకాయిలు  పెట్టడమా? విశాఖలో 99 పైసలకే ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం పవిత్ర యజ్ఞమా? లూలూ వంటి సంస్థలకు వందల కోట్ల విలువైన  ఆర్టీసీ భూమిని, ప్రభుత్వ భూమిని కారు చౌకగా అప్పగించడమా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే  కనిపిస్తాయి. ఇవన్ని పవిత్ర యజ్ఞంలో భాగమనుకుంటే చేసేదేమీ లేదు. తన విధానాలను మార్చుకునే రీతిలో చంద్రబాబు తన పంథా ఉంటే  ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప, ఎప్పటి మాదిరి ఊక దంపుడు ఉపన్యాసాలతో, ఎల్లోమీడియాలో హెడ్ లైన్స్ లో ఉంటూ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను హెచ్చరించినట్లు లీకులు ఇచ్చుకుంటే పంథా మారినట్లు ఎలా అవుతుందో తెలియదు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పరోక్షంగా హెచ్చరించారట. చిత్రం ఏమిటంటే కొలికపూడి చేసిన ఆరోపణల జోలికి వెళ్లకుండా ఆయననే మందలించడం ఎలాంటి పాలన అవుతుంది. టీడీపీ టిక్కెట్ కోసం ఎన్నికలకు ముందు తాను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి రూ.ఐదు కోట్లు ఇచ్చానని కొలికపూడి కొన్ని ఆధారాలు చూపించారు. ఆ విషయం ఏమైంది? చిన్ని అనుచరులు తిరువూరులో అరాచకాలకు పాల్పడుతున్నారని, ఇసుక, బెల్ట్ షాపులు, చివరికి గంజాయి కూడా అమ్ముతున్నారని విమర్శించారు. ఇందులో వాస్తవం ఉందా? ఉంటే ఎంపీ, ఆయన అనుచరులపై ఏం చర్య తీసుకున్నారు? చర్యలు తీసుకోవడం అపవిత్ర యజ్ఞం అవుతుందా? పార్టీకి నష్టం కలిగిస్తే కఠినంగా ఉంటానని కొలికపూడినే బెదిరించడం ఏమిటి? అంటే చిన్ని వంటివారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఎవరూ ప్రశ్నించకూడదా? ఒకవేళ కొలికపూడి చెప్పిన వాటిలో అసత్యం ఉంటే ఆయనపై చర్య తీసుకోవాలి కదా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు ఏ చిన్న విమర్శ చేసినా, ఆధారాలు చూపాలంటూ  పోలీసులను ప్రయోగించి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కదా? ఈ సూత్రం టీడీపీ నేతలకు వర్తించదా? రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సుధామాధవి నుంచి వేమన సతీష్ అనే మరో నేత రూ. ఏడు కోట్లు తీసుకున్నారన్నది ఆరోపణ. 

ఆమె దీనిపై ఫిర్యాదు చేస్తే అసలు విషయాన్ని పక్కనబెట్టి ఆమె కుటుంబాన్నే భయపెడతారా? అది పవిత్ర యజ్ఞమా? ఆమె చేసిన ఆరోపణపై విచారించి ఎందుకు చర్య తీసుకోలేదు? మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తే పోలీసులు ఆమెనే వేధిస్తారా? ముఖ్యమంత్రి కార్యాలయం ఆ విషయంలో విచారణ చేసి, ఫిర్యాదులో నిజం లేదని తేలితే ఆమెపైనే చర్య తీసుకోవాలని చెబుతారా? ఇదెక్కడి న్యాయం?పైగా పోలీసులు ఆమె సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కాని, నిందితుడి ఫోన్ తీసుకోవడం, విచారణకు పిలవడం చేయలేదట. మహిళల జోలికి వస్తే ఖబడ్దార్ అన్నారని తెలుగుదేశం మీడియాలో వార్తలు రాయించుకుంటే సరిపోతుందా? చంద్రబాబువి మేకపోతే ప్రకటనలే అన్న భావన కలగదా? పైగా ఈ వార్తను కవర్ చేసిన సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడమా? ఇదేనా పంథా మార్చుకోవడం? పవిత్ర యజ్ఞం? మహిళలను వేధించారని, స్త్రీలతో  అసభ్యంగా మాట్లాడారని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే వారిని కనీసం మందలించలేదే! చంద్రబాబు నియోజవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నేతలు, కేడర్‌తో భేటీ అవుతున్నారట.

వారి నుంచి ప్రభుత్వం గురించి నిజమైన ఫీడ్ బ్యాక్ తీసుకుంటే కదా చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందని అనుకుంటారు! ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం తెప్పించుకుని ఆశించిన పనితీరు లేనివారిని సున్నితంగా హెచ్చరిస్తున్నారట. ఒక పక్క కఠినంగా ఉంటున్నారని వీరే ప్రచారం చేస్తారు. మరో వైపు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలిస్తున్నారని వీరే చెబుతారు. దేనిని  నమ్మాలి? ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ ఆఫీసును ఆదేశించారట. ఈ లెక్కన ఎమ్మెల్యేల తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించుకోవచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలపై ఇసుక, మద్యం తదితర స్కామ్ ల ఆరోపణల గురించి చంద్రబాబుకు తెలియదా? వారికి తగినట్లే కార్యకర్తలు పలుచోట్ల బెల్ట్ షాపులు నడుపుతున్నట్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు  వార్తలు వస్తున్నాయే. ఎవరికి వారు సంపాదన రంధిలో పడ్డారని వార్తా కధనాలు వస్తున్నాయి కదా?అ వి నిజమా? కాదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  80 నుంచి వంద మంది ఓడిపోతారని కొన్ని సర్వేలు సూచించాయి. 

దాంతో కొంత ఆందోళనకు గురై చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా పంథా మారిందంటూ లీకులు ఇచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. వంద రోజులలో గంజాయిని అరికడతామని ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ తర్వాత అంతా నియంత్రించేసినట్లు  ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా ఏపీ గంజాయి హబ్ గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. చివరికి గంజాయి బేరగాళ్లు నెల్లూరు వంటి చోట్ల హత్య,దాడులు వంటివాటికి పాల్పడ్డారు.వీరికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరి అండదండలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.ఏదో పెన్షన్లు, సీఎం రిలీఫ్ చెక్కులు పంచితే ఎమ్మెల్యేలు బాగా పనిచేసినట్లు అనుకుంటే అంతకన్నా ఆత్మ వంచన ఉండదు.  పవిత్రమైన యజ్ఞం అంటూ కధలు చెప్పే బదులు చంద్రబాబు మొత్తం తన ప్రభుత్వ తీరును సమీక్షించుకుని నిజంగా తన పంధాను మార్చుకుని ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తే ఆయనకే మంచిపేరు వస్తుంది.


కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement