సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యాదవ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో 50 కోట్లు విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమిపూజ కూడా నిర్వహించారు.
అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూకేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేశారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయం అని వారు విమర్శిస్తున్నారు.
భవనం నిర్మాణం ఆలస్యానికి గురి కాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమినే తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ భవనంకు స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.


