కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో పీటీఎంకి హాజరైన టీడీపీ కార్యకర్తలు
రాష్ట్ర వ్యాప్తంగా దారి తప్పిన వైనం
నేతల కోసం ప్రధానోపాధ్యాయుల పడిగాపులు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై పొగడ్తలకే సమయం సరి
విద్యా సంబంధ అంశాలపై చర్చకు దక్కని చోటు
చాలా చోట్ల మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: పాఠశాలలు, విద్యార్థులు, విద్యా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు టీడీపీ సభల్లా మారాయి. రాజకీయ ప్రసంగాలకు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్‌పై పొగడ్తలకు పరిమితమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తొలి ప్రాధాన్యంతో పాటు మాట్లాడే అవకాశమివ్వాల్సిన చోట రాజకీయ నాయకులే అంతా ముందుండి నడిపించారు. మెగా పీటీఎం పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా అందించిన డబుల్ డెస్క్ బెంచీలకు ‘లీప్’ స్టిక్కర్లు అతికించారు. వాటిపైనే కూర్చుని సీఎం విద్యార్థులతో మాట్లాడారు. అన్ని చోట్లా కేవలం రాజకీయ ప్రసంగాలు, లోకేశ్‌ను మార్కెట్ చేయడమే ప్రధానంగా సమావేశాలే సాగాయి.
గుంటూరు పట్టణంలో జరిగిన పీటీఎంలో వేదిక పైనా, కిందా టీడీపీ నాయకులే ఆక్రమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల పీటీఎంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని బూటుకాళ్లతో తన్నిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావును డీఈవో సస్పెండ్ చేశారు. కడపలోని గాం«దీనగర్ మున్సిపల్ హైసూ్కల్లో తల్లిదండ్రుల కోసం వేసిన కురీ్చల్లో టీడీపీ నేతలు కూర్చున్నారు.
పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు
వైఎస్సార్ కడప జిల్లా కాశినాయనమండలంలోని నాయునిపల్లి ఎంపీపీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమునెమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తల్లిదండ్రులు రాకపోవడంతో టీడీపీ నేతలు బలవంతంగా పిలిపించారు. తిరుపతి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయి.
తల్లిదండ్రుల కంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా చోట్ల 30 శాతం మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనలేదు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే రీతిలో సమావేశాలు కొనసాగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాక ఆలస్యం కావడంతో హిందుపురం టీడీపీ ఎమెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ప్రదర్శించారు.
భోజనం బాగోలేదంటూ ఆగ్రహం
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హైసూ్కల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం బాగుండటం లేదని, దీంతో పిల్లలు ఇళ్లకు వచ్చేస్తున్నారని చెప్పారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చక పోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాన్ని బహిష్కరించారు. పాఠశాల గేటు మూసివేసి బయటే ఉండిపోయారు.


