భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త సిబ్బంది విధుల నియమాలు (ఎఫ్‌డీటీఎల్), సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఆలస్యం ఆలస్యం కావడం లేదా రద్దు చేయడం జరిగింది. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశించినప్పటికీ.. ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు. మరో పది రోజుల్లో.. సాధారణ కార్యకలాపాలు తిరిగి కొనసాగవచ్చని కంపెనీ తెలిపింది. ఇటువంటి తరుణంలో ‘ఇండిగో’ యజమాని ఎవరు? అని నెట్టింట చర్చ జరుగుతోంది..
ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ కలిసి స్థాపించారు. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 1989లో ఏర్పాటు అయ్యింది. వాయు రవాణా నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద క్యారియర్‌గా ఎదిగింది. రాహుల్ భాటియా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలోని కీలక వాటాదారులలో ఒకరు. కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన భాటియా నాయకత్వంలో ‘ఇండిగో’ కేవలం విమానయానానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాలకూ విస్తరించింది.
వీటిలో హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, పైలట్ శిక్షణ, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీరింగ్ వంటి ముఖ్య వ్యాపార వెంచర్లు ‘ఇండిగో’లో ఉన్నాయి. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ భాటియా ఆస్తుల నికర విలువ $8.1 బిలియన్లు(సుమారుగా రూ. 67,230 కోట్లు) ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రాహుల్ భాటియా 420వ స్థానంలో ఉన్నారు. అతను ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో ప్రమోటర్‌గా ఉంటూ, నేరుగా 0.01% వాటా లేదా 40,000 షేర్లను కలిగి ఉన్నారు.
మరొక సహ వ్యవస్థాపకుడు అయిన రాకేష్ గంగ్వాల్, ఇండిగోను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, 2022లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. అప్పటి నుండి ఆయన ఎయిర్‌లైన్‌లో తన వాటాను విక్రయిస్తున్నారు. ప్రస్తుత బీఎస్ఈ (బీఎస్‌ఈ) డేటా ప్రకారం రాకేష్ గంగ్వాల్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సుమారు 4.53% వాటా లేదా 1,75,30,493 షేర్లను కలిగి ఉన్నారు. అంతకుముందు ఆయన దాదాపు 13.5% వాటా కలిగి ఉండేవారు. ఇండిగో ప్రస్తుతం 434 సొంత విమానాలను కలిగివుంది. అలాగే రోజుకు 2,300 విమానాలను నడుపుతూ, దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం


