సిద్ధిపేట జిల్లా: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా గ్రామ సర్పంచ్ పదవికి రైతులు, స్థానిక నాయకులు పోటీ చేస్తుంటే, ఈసారి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని బరిలోకి దిగడం గ్రామంలో చర్చనీయాంశమైంది. జిల్లెలగడ్డ పంచాయతీకి చెందిన లావుడ్య రవీందర్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నారు. బీటెక్, ఎంబీఏ చదివిన రవీందర్.. కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. హైదరాబాద్ వచ్చి సొంతంగా కంపెనీ పెట్టారు.
ప్రస్తుతం కంపెనీ బాధ్యతలు చూస్తోన్న రవీందర్ సర్పంచ్ బరిలో నిలవాలని భావించారు. జిల్లెలగడ్డ గ్రామ సర్పంచ్ పదవిని.. ఈ సారి ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఉన్నత చదువులు చదివి.. విదేశాల్లో కొలువు చేసి.. ఇప్పుడు సొంతంగా కంపెనీ నడుపుతున్న లావుడ్య రవీందర్.. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రవీందర్ శుక్రవారం తన నామినేషన్‌ను డప్పుల చప్పుళ్లతో, కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి దాఖలు చేశారు. ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసి, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం రాజకీయ రంగంలోకి రావడం గ్రామస్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి సర్పంచ్‌గా వస్తే గ్రామానికి కొత్త ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే కండువాలు కప్పుతాం..
హుస్నాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచి వస్తే వారే మావాళ్లు.. అధికార పార్టీ కండువ కప్పుకోవాలని వెళ్లిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పెడుతున్న షరతులివి. ‘గెలిచి రండి.. అప్పుడే కండువాలు కప్పుతాం’ అని కాంగ్రెస్ అధిష్టానం చెబుతోంది. అధికార పార్టీ మద్దతు ఉంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు.
మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద పోటీదారుల సందడి నెలకొంది. హుస్నాబాద్ మండలంలో 17 జీపీలు, 140 వార్డులు, అక్కన్నపేట మండలంలో 38 జీపీలు, 306 వార్డులు, కోహెడ మండలంలో 27 జీపీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోటీదారులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ప్యానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. నచ్చిన వారికి మద్దతు తెలుపుతున్నారు. ఎవరు అధికార పార్టీ వారో తెలియక కార్యకర్తలు అయోమయోంలో పడుతున్నారు. ఎవరు గెలిచినా మా వద్దకే వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పలాన వ్యక్తి మా అభ్యర్థి అని ప్రకటిస్తే మిగతా వారు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అధికార పార్టీ కండువా కప్పడానికి సమ్మతించడం లేదు.


