సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికారు. వారి మాటలకు ఆ కుటుంబం ఆశపడింది. అయితే ఏడు లక్షలు ఇస్తేనే ఆ గుప్త నిధులను వెలికి తీస్తామని మోసగాళ్లు వారికి చెప్పారు.
దాంతో వారి మాటలను నమ్మి బాధితులు ఏడు లక్షలు ముట్ట జెప్పారు. అనంతరం రోజులు గడుస్తున్నా గుప్త నిధులు బయటకు తీయకపోవడంతో వారు మోసపోయినట్టు బాధితులు గ్రహించారు. నిందితులు అప్పటికే పరారైనట్టు సమాచారం.
వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు మోసగాళ్లపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.


