సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే..
చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే..
ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
నిందితుడికి నిరీక్షణ తప్పదా?
ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు.


