గద్వాలటౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా.. ఒకరు పాటపాడితే.. పదవి మరొకరు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల మండలం ఈడిగోనిపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ స్థానానికి గత వారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన రాఘవేంద్ర తన భార్య సరస్వతిని సర్పంచ్ చేయడానికి రూ.9.80 లక్షలు పాట పాడి దక్కించుకోవడమేగాక అడ్వాన్స్‌గా రూ.లక్ష గ్రామస్తులకు అందజేశారు.
వేలం ముగిసిన తర్వాత సరస్వతి సర్పంచ్ అంటూ సంబరాలు నిర్వహించి సన్మానాలు చేశారు. ఉపసర్పంచ్ ఎంపిక విషయంలో కొంత బేధాభిప్రాయాలు తలెత్తి నామినేషన్ల పర్వంలో గందరగోళం నెలకొంది. మరుసటి రోజే నామినేషన్‌కు తుది గడువు ఉండటంతో వేలం పాడిన వారితో పాటు వార్డు సభ్యులకు వారి ప్యానల్ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీన్ని గమనించి గ్రామానికి చెందిన రమేష్ తన భార్య రాణి పేరుతో సర్పంచ్ పదవికి, వారి ప్యానల్ నుంచి వార్డు సభ్యులకు నామినేషన్లు వేయించారు.
సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో రాణి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశా రు. వేలం డబ్బులు ఎన్నికైన సర్పంచ్ చెల్లించా లని కొందరు గ్రామస్తులు పట్టుబడుతున్నా రు. అనుకున్నది ఒక్కటి.. అయినదొక్కటి అంటూ గ్రామస్తులు కూనిరాగాలు తీస్తున్నారు.


