అయ్యిందొక్కటి..!
అనుకున్నదొక్కటి..
● తండాల్లో అభ్యర్థుల తండ్లాట
● వచ్చి పోయే చార్జీలు మావే.. దావత్ ఇస్తామంటూ ఎర
● ఫోన్ పే, గూగుల్ పే నంబర్లవాకాబు
● కొనసాగుతున్న
అనుకూల, వ్యతిరేక ఓటర్ల ఫిల్టర్
గద్వాలటౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా.. ఒకరు పాటపాడితే.. పదవి మరొకరు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల మండలం ఈడిగోనిపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ స్థానానికి గత వారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన రాఘవేంద్ర తన భార్య సరస్వతిని సర్పంచ్ చేయడానికి రూ.9.80 లక్షలు పాట పాడి దక్కించుకోవడమేగాక అడ్వాన్స్‌గా రూ.లక్ష గ్రామస్తులకు అందజేశారు. వేలం ముగిసిన తర్వాత సరస్వతి సర్పంచ్ అంటూ సంబరాలు నిర్వహించి సన్మానాలు చేశారు. ఉపసర్పంచ్ ఎంపిక విషయంలో కొంత బేధాభిప్రాయాలు తలెత్తి నామినేషన్ల పర్వంలో గందరగోళం నెలకొంది. మరుసటి రోజే నామినేషన్‌కు తుది గడువు ఉండటంతో వేలం పాడిన వారితో పాటు వార్డు సభ్యులకు వారి ప్యానల్ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీన్ని గమనించి గ్రామానికి చెందిన రమేష్ తన భార్య రాణి పేరుతో సర్పంచ్ పదవికి, వారి ప్యానల్ నుంచి వార్డు సభ్యులకు నామినేషన్లు వేయించారు. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో రాణి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశా రు. వేలం డబ్బులు ఎన్నికై న సర్పంచ్ చెల్లించా లని కొందరు గ్రామస్తులు పట్టుబడుతున్నా రు. అనుకున్నది ఒక్కటి.. అయినదొక్కటి అంటూ గ్రామస్తులు కూనిరాగాలు తీస్తున్నారు.
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు పల్లెలో మొదలైంది. జిల్లాలో మొదటి విడతలో కొడంగల్ నియోజకవర్గంలో ఈ నెల 11న పోలింగ్ జరగనుండడంతో అభ్యర్థులు వలస ఓటర్లకు గాలం వేసేందుకు ఎవరి స్థాయిలో వారు అనుచరగణంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలింగ్‌కు ఒక రోజు ముందే గ్రామాలకు చేరుకోవాలని వలస ఓటర్లను అభ్య ర్థిస్తున్నారు. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో అభ్యర్థులు వారికి అనుకూల, వ్యతిరేక ఓటర్లను ఫిల్టర్ చేసుకుంటున్నారు. వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వెపునకు ఎలా తిప్పుకోవాలి అని ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా వలస ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. వారిని రప్పించేందుకు వాహనాల్లో వచ్చే వారికి అద్దెలు, భోజనాలు చెల్లించేందుకు సైతం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ పనులను అభ్యర్థులు తమకు అత్యంత నమ్మకమైన వారికి అప్పజెపుతున్నారు.
మూడు విడతల్లో పోలింగ్ తేదీలకు నాలుగు రోజుల తేడా ఉండడంతో అభ్యర్థుల్లో అటెన్షన్ మొదలైంది. ఎలాగైనా గెలవాలని అన్ని దారులు వెతుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా పక్కన పెట్టుకుని తనకు పడే ఓట్లపై లెక్కలు వేస్తున్నారు. మిగతా ఓట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. పల్లెల్లో ఆయా పార్టీల వార్డు ఇన్‌చార్జులు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో వలస ఓట్లకు పాధాన్యం ఏర్పడింది.
ఏదైనా ఒక ప్రాంతంలో తమకు అనుకూలమైన ఓటర్లు ఎక్కువగా ఉంటే అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు సైతం సమకూర్చేందుకు సిద్ధపడుతున్నారు. బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో వస్తున్న వారికి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా రవాణా ఖర్చులను ముందుగా చెల్లిస్తున్నారు. ఓటర్ల జాబితాలో 30 శాతం వరకు వలస ఓటర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఉద్యోగం వదిలి.. బరిలో నిలిచి
పాన్‌గల్: ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పాన్‌గల్ మండలం చిక్కేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన ముంత పార్వతి బీఆర్‌ఎస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగింది. ముందస్తుగా తన ఆశా కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
దినసరి కూలీ.. గ్రామ పాలనకు కదిలి...
అడ్డాకుల: ఊర్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందున వాటిని తానే బాగు చేయిస్తానంటూ ఓ దినసరి కూలీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన అడ్డాకుల మండలంలోని పెద్దమునుగల్‌ఛేడ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునగల కృష్ణయ్య దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తాను ఉండే చోట సమస్యలు ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం పెయింటింగ్ పనులు మధ్యలోనే వచ్చి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పెయింటింగ్ వేసే దుస్తులతోనే వచ్చి నామినేషన్ వేయడం అందరినీ ఆశ్చర్యంలో ముచెత్తింది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద తీవ్ర దుర్వాసన వస్తున్నా పట్టించుకోవడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.
ఈడిగోనిపల్లి గ్రామపంచాయతీలో వి‘చిత్రం’
కత్తెరతో చించేద్దాం..
అయ్యిందొక్కటి..!
అయ్యిందొక్కటి..!


