సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారీ అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు మల్లన్నను అడ్డుకున్నారు. ఫిర్జాదిగూడ చెన్నరెడ్డి ఎంక్లవ్‌లో మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మల్లన్న సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా.. రెండు రోజులు క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్వేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం, చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ శుక్రవారం తుది శ్వాస విడిచాడు. నేడు సాయి అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా, ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్‌కి న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్, తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం వదిలేశారు.


