శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ నుంచి శుక్రవారం తెల్లవారు జామున 3.38 గంటలకు బయల్దేరిన ఫ్లైట్ మరో గంటలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో మెయిల్ వచ్చింది. ఉదయం 7.20 గంటలకు ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు ల్యాండ్ కానున్న దుబాయ్ ఈకే–526 విమానం బాంబులతో పేల్చివేయనున్నట్లు హెచ్చరిక మెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబ్ థ్రెట్ అసెస్ కమిటీ) ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
విమానం ఉదయం 8.38 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే విమానాన్ని ప్రత్యేక బే వద్దకు తీసుకెళ్లి సీఐఎస్‌ఎఫ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ప్రయాణికులందరి లగేజీలతో పాటు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరో విమానానికి కూడా శుక్రవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో భద్రతాధికారులు ఉరుకులు పరుగులుపెట్టారు. ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు రాత్రి 8 గంటలకు ఈ మెయిల్ రావడంతో భద్రతాధికారులు వెంటనే బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 8.20 గంటలకు విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని ప్రత్యే బే వద్దకు తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.


