విజన్‌డాక్యుమెంట్‌పైఅధికారులకుసీఎం సూచన
గ్లోబల్ సమ్మిట్ పూర్తిస్థాయి ఆర్థిక సదస్సు
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్‌మ్యాప్
విజన్ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలోనూ ఉండాలి
వార్ రూమ్ సందర్శించిన సీఎం..ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో రాబోయే కాలంలో చేపట్టే ప్రగతికి సంబంధించిన రాష్ట్ర ప్రణాళికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పారు.
శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్‌రూమ్‌ను సందర్శించారు. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్‌మ్యాప్
‘ఇది పూర్తిగా ఆర్థికాంశాలతో కూడిన సమ్మిట్. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే రోడ్‌మ్యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నాం. విజన్ డాక్యుమెంట్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా డిజిటల్ రూపంలోనూ ఉండాలి. వచ్చే సంవత్సరం దావోస్‌లో జరిగే సమావేశంలో ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ విజయోత్సవాన్ని వివరించడానికి వీలుగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం సమ్మిట్ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పుడు, ఏం జరుగుతుందనే వివరాలను మీడియాకు వెల్లడిస్తారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విమానాల రద్దుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడాలని, హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేలా చూడాలని సీఎం ..అధికారులను ఆదేశించారు. కాగా సదస్సు నిర్వహించే ప్రదేశంలో అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విజన్ డాక్యుమెంట్
గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని సూచించే ఈ డాక్యుమెంట్ రూపకల్పన వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎస్ కె.రామకృష్ణారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం.. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా డాక్యుమెంట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది.
డాక్యుమెంట్ డిజైన్‌కు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ డాక్యుమెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉండనుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు త్వరలో ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. వివిధ రంగాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కవర్ పేజీని..భవిష్యత్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకోనున్న సూచనాత్మక నగరం ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు.


