గోపన్‌పల్లిలో అలజడి! | Gopanpalli lands were added to the restricted list | Sakshi
Sakshi News home page

గోపన్‌పల్లిలో అలజడి!

Dec 6 2025 3:38 AM | Updated on Dec 6 2025 3:38 AM

Gopanpalli lands were added to the restricted list

భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో కలకలం

ఎక్కడ చూసినా ఇదే చర్చ..అధికారులను ఆరా తీసిన స్థానికులు 

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌

గచ్చిబౌలి (హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం గోపన్‌పల్లిలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చిందనే సమాచారం స్థానికుల్లో అలజడి సృష్టించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం అంతటా శుక్రవారం ఇదే చర్చ సాగింది. తమ కాలనీలు, ఇళ్లు, కార్యాలయాలు, కంపెనీల పరిస్థితి ఏమిటనేది ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేసింది. సాక్షి’లో శుక్రవారం ‘గోపన్‌పల్లిపై నిషేధం పిడుగు’అనే శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. కాగా ఇది నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. ఉదయాన్నే చలి వాతావరణంలో ఇది వేడిని రాజేసింది. నిషేధిత జాబితాలో ఏ సర్వే నంబర్లు చేరాయనే ఉత్కంఠ నెలకొంది. 

తమ ప్రాంతం ఏ సర్వే నంబర్‌ కిందకు వస్తుందంటూ జనం చర్చించుకున్నారు. పలు కాలనీలు, బస్తీలలోని టీకొట్ల వద్ద, నలుగురు గుమిగూడిన చోట ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలలో ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఆరా తీశారు. 20 నుంచి 25 ఏళ్ళ క్రితం స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ళు నిర్మించుకున్నామని, ఇప్పుడు ఆ భూము లు నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కొందరు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీశారు. 

అన్ని అనుమతులతో ఇళ్ళను నిర్మించుకున్నామని, కొందరు బిల్డర్లు నిర్మించిన గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి నివసిస్తున్నామని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటూ వాపోవడం కని్పంచింది. ప్రభుత్వం అనుమతిస్తేనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేసుకుని, రుణాలు తీసుకుని, అనుమతులతో నిర్మించుకున్నామని, ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. అధికారులకు ఫోన్లు చేస్తే తమకేమీ తెలియదంటున్నారని వాపోయారు.

గుడి భూములు గుడి కార్యక్రమాలకే వాడాలి 
గుడుల భూములపై నిషేధం పెట్టడం ఓకే..కానీ ఇతర వాటిపై నిషేధం సరికాదు. ఏన్నో ఏళ్ల క్రితం గోపన్‌పల్లి రంగనాథస్వామి ఆలయం అభివృద్ధి కోసం మా పెద్దలు 27 ఎకరాల మాన్యం భూములు ఇచ్చారు. వాటి విలువ ప్రస్తుతం రూ.3 వేల కోట్ల వరకు పలుకుతుంది. ఈ భూములను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ దశాబ్దాలుగా రాష్ట్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి కదలిక లేదు.

 ఇలాంటి సమయంలో ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం సరైనదే, కానీ ఈ భూములను కేవలం రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి, అర్చకులు, వార్షికోత్సవం, పూజా కార్యక్రమాలకే వాడుకోవాలి. ఇక సుప్రీంకోర్టులో గెలిచి పట్టాభూమిగా తీర్పు వచ్చిన భూములు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టు మెంట్లు నిర్మించిన భూములపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తాం. పన్నులు కట్టకపోతే ప్రభుత్వం పెనాల్టీ వేసి వసూలు చేయాలి కానీ ఇలాంటి చర్యలు తీసుకోకూడదు. – రవీంద్రప్రసాద్‌ దూబే, అధ్యక్షుడు గోపన్‌పల్లి రంగనాథస్వామి ఆలయం

వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి 
ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణాలు ఉన్న ప్రాంతాలను ఈ నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. పైసాపైసా కూడబెట్టి కొన్నవారు, అప్పులు చేసి కొనుగోలు చేసిన వారు ఉన్నారు. వారికి ప్రభుత్వమే న్యాయం చేయాలి. ప్రజలు కూడా ప్రభుత్వం నిషేధం విధించిన సర్వే నంబర్లలో నిర్మించిన వాటిని కొనుగోలు చేసి మోస పోవద్దు. ఆయా ప్రాంతాలపై పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాతే లావాదేవీలు చేయాలి.   –పీవీ రావు, డైమండ్‌ హైట్స్, గోపన్‌పల్లి

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి 
నిషేధిత జాబితాలో చేర్చిన గోపన్‌పల్లి జర్నలిస్ట్‌ కాలనీ పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వం మాకు స్థలాలు కేటాయించింది. అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నాం. జర్నలిస్టుల పేరిట రిజిస్టర్‌ అయ్యి ఖాళీగా ఉన్న ఓపెన్‌ ప్లాట్లు ఇంకా ఉన్నాయి. వీటన్నిటిపై ఎలాంటి గందరగోళం లేకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్న భూముల పరిస్థితి ఏమిటో కూడా తేల్చాలి.  – తిరుమలగిరి సురేందర్, సీనియర్‌ జర్నలిస్ట్, ఏపీప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌

భూముల్ని విక్రయించే చర్యలు సరికాదు 
ప్రభుత్వ భూములపై నిషేదం విధిస్తే మంచిదే, కానీ కోర్టు ద్వారా సొంత భూమిగా గుర్తించినవి, ఏళ్ళ క్రితం ప్రభుత్వ అనుమతులతో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, సొంత ఇళ్ళు నిర్మించుకున్న స్థలాలను కూడా నిషేధం జాబితాలో చేర్చడం అన్యాయం. 

ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఏది నిషేధం కిందకు వస్తుంది? ఏది కాదనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూములకు వందల కోట్ల విలువ వచ్చేసరికి వాటి విక్రయం కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదు.  – కొమిరిశెట్టి సాయిబాబా, మాజీ కార్పొరేటర్‌ గచ్చిబౌలి డివిజన్‌

వాట్సాప్‌లో ‘సాక్షి’కథనం సర్క్యులేట్‌ 
‘సాక్షి’లో ప్రచురితమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం నుంచి గోపన్‌పల్లి, గోపన్‌పల్లి తండా, ఎన్టీఆర్‌నగర్, తాజ్‌నగర్, డైమండ్‌ హైట్స్, వీకర్‌ సెక్షన్‌కాలనీ, పరిసరాల్లోని కాలనీలు, బస్తీలలో వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అయ్యింది. వాట్సాప్‌లో ‘సాక్షి’కథనం చూశాకే చాలామందికి విషయం తెలిసింది.

22(ఏ) జాబితాపై సర్కారు పునఃసమీక్ష!
త్వరలో తుది జాబితా అంటూ పోర్టల్‌ స్క్రీన్‌పై సమాచారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ భూముల జాబితా రూపకల్పనలో చోటుచేసుకున్న తప్పుల దిద్దుబాటుకు రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. 22ఏలో పొందుపరిచిన జాబితాను పునఃసమీక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం ‘గోపన్‌పల్లిపై నిషేధం పిడుగు’శీర్షికన ‘సాక్షి’ప్రచురించిన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. ఈ జాబితాపై సీరియస్‌ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం వరకు స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్ల పోర్టల్‌లో కన్పించిన ఈ 22ఏ జాబితా ప్రస్తుతం కన్పించకుండా పోయింది (బ్లాక్‌ చేశారు). ఈ జాబితాను సమీక్షిస్తున్నామని, త్వరలో తుది జాబితాను వెల్లడించనున్నట్లు పోర్టల్‌ స్క్రీన్‌పై సమాచారాన్ని పొందుపరిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement