మానేరు నది ఒడ్డున ఆధారం వెలుగులోకి
మధ్య రాతి యుగం నాటి ఏనుగు వర్ణ చిత్రం లభ్యం
తమ చుట్టూ తిరగాడిన జంతువుల చిత్రాలు గీసిన ఆదిమానవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా ఏనుగులు.. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జూపార్కులు, సర్కస్‌లలో తప్ప తెలంగాణ భూభాగంలో ఏనుగుల సంచారాన్ని చూసిన దాఖలాలు ఉండవు. కానీ గతంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగుల సంగతి పక్కనపెడితే, ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో ఏనుగులు విస్తారంగా తిరుగాడాయన్న మాట చరిత్ర పరిశోధకులు అడపాదడపా చెప్తుంటారు.
తాజాగా ఇందుకు సంబంధించిన మరో ఆధారం వెలుగు చూసింది. మానేరు నది ఒడ్డున అడవి సోమనపల్లి శివారు అడవి (మంథని సమీపం)లోని గుట్టగుండుకు ఏనుగు చిత్రం వెలుగు చూసింది. ఇది దాదాపు 13 వేల ఏళ్ల కిందట మధ్యరాతియుగంలో గీసిన చిత్రంగా నిపుణులు తేల్చారు. నాటి మానవులు, తమతో సహజీవనం చేసిన జంతువుల జాడలను ఇలా చిత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు. పలు రకాల జంతువులు, మనుషుల బొమ్మల్లో ఏనుగు చిత్రం కనిపించింది. దీంతో అప్పట్లో ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం విస్తృతంగా ఉండేదన్న విషయం రూఢీ అవుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
గతంలో హైదరాబాద్ శివారులోని గుండ్లపోచంపల్లి శివారు గుట్ట గుహలో కూడా ఆదిమానవులు గీసిన ఏనుగు చిత్రం గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి అలాంటి రాతి చిత్రం వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవుల్లో రాక్షస బల్లి (డైనోసార్) శిలాజాన్ని జీఎస్‌ఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్‌లో ఆ శిలాజం ప్రదర్శనాంశంగా ఉంది. దాదాపు 6 కోట్ల సంవత్సరాల కిందటినాటిదని దాని డేటింగ్‌ను శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పటి ప్రకృతి ఉత్పాతం ఫలితంగా డైనోసార్లు అంతరించాయి.
అలా ప్రకృతి విపత్తులతో ఎన్నో జీవజాతులు కాలగర్భంలో కలిసిపోగా, కొన్ని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. అలా ఒకప్పుడు విస్తారంగా తిరుగాడిన ఏనుగులు కూడా వాతావరణ ప్రభావంతో తెలంగాణ భూభాగాన్ని విడిచి వెళ్లాయని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యరాతి యుగం (సాధారణ యుగానికి ముందు 10 వేల ఏళ్ల నుంచి 8 వేల ఏళ్ల మధ్య కాలం), కొత్త రాతియుగం, చారిత్రక యుగం కాలాల్లో ఏనుగులు సంచరించాయని స్పష్టమవుతోంది.
తాజాగా అడవి సోమనపల్లి సమీపంలోని మానేరు నది ఒడ్డున ఉన్న గుట్టలో ఆదిమానవుల ఆశ్రయాన్ని స్థానిక యువకులు గుర్తించారు. దీన్ని తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు చొల్లేటి శ్రీనివాస్ పరిశీలించి వాటి చిత్రాలను సేకరించారు. వీటిని ఆదిమానవుల రాతి చిత్రాల నిపుణుడు బండి మురళీధరరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ హరగోపాల్ పరిశీలించి, ఇందులోని చిత్రాలు పాత, మధ్య, కొత్త, చారిత్రకయుగాల్లో గీసినట్టు గుర్తించామని చెప్పారు. ఆయా కాలాల్లో ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న ఆదిమానవులు ఆ రాతిని కాన్వాస్‌గా మార్చుకుని చిత్రాలు గీసినట్టు వారు వెల్లడించారు.
అంటే చిత్రాలకు, చిత్రాలకు మధ్య వేల ఏళ్ల విరామం ఉందన్నమాట. ఈ చిత్రాల్లో వేటాడుతున్న మనుషులు, చేతి ముద్రలు, డైమండ్ ఆకారపు గీతలు, వివిధ భంగిమల్లో ఉన్న మానవులు, ఎద్దు, జింక, ఏనుగు, తేనెపట్టు, త్రిశూలం, ఆంగ్ల ‘వి’ఆకారపు చిత్రాలతోపాటు ఇతర ఆకృతులున్నాయని, ఈ చిత్రాలు ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు రంగుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రాల్లో చాలావరకు వాతావరణ ప్రభావంతో వెలిసిపోయాయని, మిగతా వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని వారు వెల్లడించారు.


