హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాడ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ)పై స్టేటస్‌కో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఎండీ, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని పలు పారిశ్రామికవాడల్లోని 9,292.53 ఎకరాల భూములను క్రమబద్దీకరించి, వాణిజ్య, నివాస వినియోగంగా మార్చడానికి ప్రభుత్వం ఈ విధానం తీసుకొచి్చంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్ చేస్తూ రిటైర్ట్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డితో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేదు..
హిల్ట్ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని పార్టీ ఇన్ పర్సన్‌గా పాల్ వాదనలు వినిపించారు. పురుషోత్తంరెడ్డి తరఫున న్యాయవాది కె.ప్రతీక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సవరించకుండా పారిశ్రామిక భూములను వినియోగించే విధానాన్ని (ల్యాండ్ యూజ్) మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా హిల్ట్‌పీ జీవో ఉంది.
ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) చేయకుండానే వేలాది ఎకరాల్లోని పారిశ్రామిక భూములను నివాస స్థలాలుగా (రెసిడెన్షియల్ జోన్)గా మార్పు చేయడం దారుణం. ఇలాంటి నిర్ణయం అమల్లోకి వస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మాస్టర్ ప్లాన్ సవరణ చేయకుండా, ప్రజల అభ్యంతరాలను స్వీకరించకుండా జీవో జారీ సరికాదు. దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించినందున తాజా జీవోను నిలిపివేయాలి’అని కోరారు.
సర్కార్ నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందిపోయి..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివేక్ రెడ్డి వాదనలను తోసిపుచ్చారు. ‘హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించాల్సింది పోయి పిటిషన్లు వేసి అడ్డుకోవాలని చూడటం సరికాదు.
బాలానగర్, కాటేదాన్, కూకట్‌పల్లిలోని కాలుష్యకారక పరిశ్రమలను జీహెచ్‌ఎంసీ పరిమితుల నుంచి తరలించే వరకు, పారిశ్రామిక భూమిని మరే ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి సర్కార్ అనుమతించదు. మాస్టర్ ప్లాన్‌ను సవరించే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలను ప్రభుత్వం కోరుతుంది..’అని వెల్లడించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరిస్తూ విచారణ వాయిదా వేసింది.


