తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఆయన క్షమాపణను అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచి్చంది. అయితే ధిక్కరణ కేసు కొనసాగుతుందని, వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. బతుకమ్మకుంట భూ వివాదంపై జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం.. రంగనాథ్‌ను నేరుగా హాజరై వివరణివ్వాలని గతంలో ఆదేశించింది. అయినా గత నెల 27న ఆయన హాజరుకాలేదు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారిక అవసరాలు, అనివార్యమైన విపత్తు నిర్వహణ బాధ్యతల కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను కొట్టివేసింది.
డిసెంబర్ 5న ఎలాంటి కారణాలు చెప్పకుండా హాజరుకావాలని మరోసారి ఆదేశించింది. దీంతో శుక్రవారం రంగనాథ్ ధర్మాసనం ముందు హాజరై క్షమాపణ కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీఇచ్చారు. దీంతో ధర్మాసనం ధిక్కరణ పిటిషన్‌లో వాదనలు విన్నది.
జూన్ 12 తర్వాత నిర్మాణాలు చేపట్టినట్లు తాజా ఫొటోల్లో కనిపిస్తోందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రస్తావన తీసుకురావొద్దని, ధిక్కరణపైనే వాదనలు వినిపించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. సివిల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా డిసెంబర్ 18కి వాయిదా వేసింది.


