ఫోర్త్ సిటీలో ‘అఫర్డబుల్ హౌసింగ్’ బెస్ట్
కమ్యూనిటీ లివింగ్‌కు జోన్ కేటాయించండి
డెవలపర్లకూ పన్ను రాయితీ కల్పించాలి
ప్రభుత్వాన్ని కోరుతున్న డెవలపర్ల సంఘాలు
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్(చౌక ధరల ఇళ్లు) తగ్గుముఖం పట్టాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నగరానికి దక్షిణ భాగంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫోర్త్ సిటీలో అఫర్డబుల్ హౌసింగ్‌కు కూడా ప్రత్యేకంగా జోన్ కేటాయించాలని డెవలపర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సంస్థలకు, క్రీడలకు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు ఎలాగైతే ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తున్నారో.. చౌక గృహాల నిర్మాణాలకు కూడా స్థలాలను కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందనేది నిపుణుల అభిప్రాయం.
ఆకాశాన్నంటిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు కొనలేని విధంగా తయారైంది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ ఏర్పడింది. డబ్బు ఉండి, ఇల్లు ఉన్నవారు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. వేతనజీవులు తమ సంపాదనలో 40–45 శాతం అద్దెలకే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ములో ఇల్లు, సంసారం గడపడం గగనమైపోయింది. మార్కెట్‌లో గృహ యజమానులు ఎక్కువ, అద్దెదారులు తక్కువగా ఉంటేనే సమత్యులత. లేకపోతే అద్దెలు విపరీతంగా పెరిగి, జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని
తీసుకురావడం అత్యవసరం.

రీ–డెవలప్‌మెంట్ అవసరం..
ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. అయితే ఈ తగ్గింపులతో ప్రభుత్వానికి ప్రత్యక్ష రాబడి తగ్గినా.. నిర్మాణ సామగ్రి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి వాటితో పరోక్షంగా అంతకు రెట్టింపు ఆదాయమే సమకూరుతుంది.
ఫ్యూచర్ సిటీలో అఫర్డబుల్ జోన్..
కో–ఆపరేటివ్ సొసైటీ, ఎంప్లాయిస్ యూనియన్లుగా ముందుకు రావాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో సామాన్య, మధ్యతరగతికి స్థలాలను కేటాయించాలి. కమ్యూనిటీ లివింగ్‌కు ప్రత్యేకంగా జోన్ కేటాయించాలి. ప్రభుత్వ భూములను మ్యాపింగ్ చేసి, అఫర్డబుల్ హౌసింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక అవసరాలను కల్పిస్తే చాలు.. అందుబాటు ధరల్లో డెవలపర్లకు భూములను అందిస్తే అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించే వీలుంటుంది. పెరీ అర్బన్ ఏరియాలో భూమారి్పడి, కన్వర్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలి. అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ, తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి స్టాంప్ డ్యూటీలో రాయితీ అందించాలి. అఫర్డబుల్ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు పన్ను రాయితీలను అందజేయాలి.

నిర్మాణ అనుమతుల్లో వేగం..
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రీ–ప్యాబ్, త్రీడీ ప్రింటింగ్, మాడ్యులర్ టెక్నాలజీలతో ఇళ్లను నిర్మిస్తే త్వరితగతిన పూర్తవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్లేస్కూళ్లు, పార్క్‌లు, కమ్యూనిటీ స్పేస్‌లు వంటి సదుపాయాలను అందించాలి. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్‌మెంటల్.. ఇలా 15 విభాగాలు, 170 డెస్క్‌ల ద్వారా వెళ్లాలి. ఇదే అనుమతుల జారీలో జాప్యానికి ప్రధాన కారణం.
అలాకాకుండా అన్ని కీలక విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో 45 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లకు స్టాంప్ డ్యూటీని, మహిళా కస్టమర్లకు ప్రత్యేక రిబేట్‌ను అందించాలి. క్లబ్‌హౌస్, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, లిఫ్ట్‌లు వంటివి కూడా నివాస జీవనంలో భాగమే. అందుకే వీటికి వాణిజ్య విద్యుత్ సుంకాల భారం నుంచి మినహాయించాలి.


