గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చీతా కూన ఒకటి ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రా–ముంబై జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలను గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ సక్సేనా ఆదివారం వెల్లడించారు. దాదాపు 20 నెలల వయస్సున్న మగ చీతా కూన కునో జాతీయవనం(కేఎన్‌పీ) నుంచి బయటకు వచ్చింది.
ఇది ఆగ్రా–ముంబై జాతీయరహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చీతా ప్రాణాలు తీసిన ఒక కారుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు అధికారి వెల్లడించారు. ఆదివారం చనిపోయిన చీతా కూనతో పాటు మరో కూన సైతం తల్లి నుంచి విడిపోయి, దారి తప్పి తిరుగుతోందని అటవీశాఖ అధికారులు చెప్పారు.


