నిజాయితీగా ఉద్యోగి ఈమెయిల్
‘నో’ చెప్పే ధైర్యం లేదన్న బాస్
అది చలికాలం మధ్యాహ్నం.. ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం.. అందరూ మధ్యాహ్న భోజనం తర్వాత పనిలోకి జారుకుంటున్న వేళ.. ఓ కుర్ర ఉద్యోగికి మాత్రం మనసు మనసులో లేదు. ఎందుకంటే.. డిసెంబర్ 17న అతని గర్ల్‌ఫ్రెండ్ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు వెళ్తోంది. మళ్లీ వచ్చేది జనవరి మొదటి వారంలోనే.. ఈ సుదీర్ఘ వియోగానికి ముందు ఆమెతో ఒక రోజు మొత్తం గడపాలి.. కానీ ఎలా?.. ఎలా?
మేనేజర్‌కి ఏం చెప్పాలబ్బా..!
సమస్య అల్లా మేనేజర్ వీరెన్ ఖుల్లర్.. సెలవు అడిగితే రొటీన్ సాకు చెప్పాలా? ’మామయ్యకి సుస్తీ’, ’ట్రైన్‌లో టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు’.. లాంటి పాత ట్రిక్స్ వాడాలా? ఇవేవీ వద్దనుకున్నాడు మన లవర్‌బాయ్.. ఎందుకంటే, నిజాయితీనే అతిపెద్ద ఆయుధమని అతనికి తెలుసు.
ఈమెయిల్ బాంబు..
మొత్తానికి అబ్బాయి.. ధైర్యం చేశాడు. కీబోర్డుపై వేళ్లు ఆనించి ఒక పారదర్శకమైన ఈమెయిల్‌ను టైప్ చేసేశాడు. అందులో ఎలాంటి అతిశయోక్తులు.. అలంకారాలు లేనేలేవు. సూటిగా చెప్పేశాడు.. ‘డిసెంబర్ 16న వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కావాలి, ఎందుకంటే నా గర్ల్‌ఫ్రెండ్ తన సొంతూరు ఉత్తరాఖండ్‌కు డిసెంబర్ 17న వెళ్తోంది. జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ ఒక్కరోజు తనతో గడపాలని కోరుకుంటున్నాను..’ఇదీ సెలవు దరఖాస్తు సారాంశం. ఆ మెయిల్ ’సెండ్’ బటన్ నొక్కిన క్షణం.. ఆఫీసులో కాదు, కుర్రాడి గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
వీడు మామూలోడు కాదు
మేనేజర్ వీరెన్ ఖుల్లర్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈమెయిల్స్ పరిశీలిస్తుండగా, ఆ అసాధారణమైన ’లవ్ రిక్వెస్ట్’ కంట పడింది.
ఖుల్లర్ ముఖంలో చిరునవ్వు, ఆశ్చర్యం కలగలిసిన భావం. ‘ఓహో! పాత రోజుల్లో అయితే వీడు ఉదయం 9.15 గంటలకే ’ఫీవర్’ అని మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ధైర్యం!‘ అనుకున్నారు. నిజానికి, గతంలో ఇలాంటి రిక్వెస్ట్‌లు రాత్రికి రాత్రి ’జబ్బు’గా మారి, మర్నాడు ఉదయం అపాయింట్‌మెంట్ అడిగేవి. కానీ కుర్రాడి నిజాయితీ, పారదర్శకత బాస్‌కి తెగ నచ్చేశాయి.
ప్రేమకు జై..
ఈ పోస్ట్ తక్షణం వైరల్ అయింది. నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని, ఖుల్లర్ ఔదార్యాన్ని చూసి మనసారా మెచ్చుకున్నారు. ‘అసలైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే!’, ‘ఆ మేనేజర్‌కి సలామ్’, ‘సెలవు దొరకడమే కష్టం అనుకుంటే, ప్రేమ పేరుతో దొరకడం అంటే లక్’.. అంటూ ప్రశంసించారు. ఆఫీసు అంటే కేవలం కట్టుబాట్లు, కఠిన నియమాలు కాకుండా, నమ్మకం, మానవత్వం కూడా ఉంటాయని ఈ చిన్న సంఘటన నిరూపించింది. ప్రేమోద్యోగి కథ సుఖాంతమైంది. అతను తన ప్రేయసితో హ్యాపీగా గడిపేందుకు టిక్కెట్ సంపాదించాడు. బేబీ ప్రేమ విషయంలో, బాసు కూడా ఓడిపోక తప్పలేదు!
పండగ చేస్కోరా బుడ్డోడా..
అప్పుడే మేనేజర్ ఖుల్లర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ క్షణికావేశంలో, తాను ఒక డైరెక్టర్ కాదు, కేవలం ఒక మనిషి మాత్రమే అని గుర్తు చేసుకున్నాడు. మనిషి జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ మహా ప్రేమ లేఖ స్క్రీన్‌షాట్‌ను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు. దానికి ఆయన జత చేసిన వ్యాఖ్యే ఈ కథకు ’పంచ్’ పాయింట్.. ‘ప్రేమకు ’నో’ చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవును ఆమోదించాను! నువ్వు హ్యాపీగా వెళ్లు తమ్ముడూ!’..
– సాక్షి, నేషనల్ డెస్క్


