సంపద సృష్టిస్తానంటూ అధికవడ్డీకి అధిక అప్పులు చేస్తున్న చంద్రబాబు
వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 80 శాతం ఈ 18 నెలల్లోనే దాటేసిన బాబు
ఇలాగైతే రాష్ట్రం సౌత్ సూడానే అంటున్న ఆర్థిక నిపుణులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించి, ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక రుణ పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) నుంచి అధిక వడ్డీకి బాండ్లు జారీ చేయడం ద్వారా అప్పు చేశారు. అంటే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ అప్పు చేశారన్నమాట.
ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా అప్పు చేయడం రాజ్యాంగంలోని అధికరణ 293 (3) కింద కేంద్ర విధించిన వార్షిక రుణ పరిమితిని ఉల్లఘించడమేనని కేంద్ర ఆర్దిక శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. కేంద్రం ఆదేశాల ప్రకారం ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా సేకరించే అప్పులు వార్షిక రుణ పరిమితిలో భాగమవుతాయని తెలిసినా కూడా చంద్రబాబు ప్రభుత్వం మద్యం బాండ్లు జారీచేయడం ద్వారా అప్పులు చేయడం ఆందోళనకరమని నిపుణులంటున్నారు. ఇలా చేయడం వల్ల అధికవడ్డీ భారంతో పాటు కమీషన్ కూడా చెల్లించాల్సి రావడం వల్ల రాష్ట్ర ప్రజలపై భారీ భారం పడుతుందని వారు పేర్కొంటున్నారు.
అధిక వడ్డీ... కమీషన్..
ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా 9.15 శాతం అధికవడ్డీకి రూ.5,490 కోట్లు అప్పు చేశారు. కేంద్రం నిబంధనలకు లోబడి చేసే అప్పులైతే 7శాతం వడ్డీకే వస్తాయి. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను, కేంద్రం మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో అతిక్రమించేసింది. అందుకే 9.15శాతం అధికవడ్డీతో అప్పులు చేస్తున్నారు. అంతేకాదు ఈ అప్పు చేయడం కోసం అప్పు మొత్తంపై 1.5 శాతం కమీషన్‌గా చెల్లించారు.
అంటే కమీషన్ రూపంలో ఏకంగా రూ.80 కోట్లకు పైగా చెల్లించారు. బాండ్లు జారీ అరేంజర్‌కు ఈ కమీషన్ చెల్లించారు. 6 నుంచి 7 శాతానికి రుణం దొరికే అవకాశం ఉన్నా 9.15 శాతానికి తీసుకున్నారు. ఇందులో కూడా కుంభకోణం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికవడ్డీకి సిద్ధపడడం, భారీ కమీషన్ చెల్లించడం అనుమానాస్పదంగా ఉందని, దీనిపై అత్యవసర దర్యాప్తు జరగాల్సిందేనని ఆర్థిక నిపుణులంటున్నారు.
రుణ పరిమితికి మించి అప్పులు..
కేంద్రం నిర్ధేశించిన రుణ పరిమితికి మించి అప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2014–19 మధ్య కేంద్రం నిర్ధేశించిన రుణ పరిమితికి మించి ఏకంగా రూ.16,418 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు మొత్తం మేర రుణపరిమితిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తగ్గించేసింది. కోవిడ్ సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రం అంతకుముందు చంద్రబాబు పరిమితికి మించి అప్పు చేసిన పాపానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి శిక్ష వేసింది.
అప్పులు చేయడానికి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను యథేచ్ఛగా అనుసరిస్తున్నారు. ఇప్పటికే మే 25వ తేదీ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్‌సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు) బాండ్లు జారీ చేశారు. ప్రభుత్వ హామీతో పాటు.. ఎన్‌సీడీ హోల్డర్లు ప్రభుత్వం అనుమతి లేకుండానే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను నేరుగా యాక్సెస్ చేయడానికి అనుమతించారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టుపెట్టడమే. ఈ మార్గం ద్వారా రూ. 9,000 కోట్లు అప్పు చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.1,91,000 కోట్ల విలువైన మైనింగ్ లీజులను సెక్యూరిటీగా పెట్టారు.
సౌత్ సూడాన్‌తో పోటీ తథ్యం..
నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేసినా రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చారు. ఇపుడు నిబంధనలకు విరుద్ధంగా అధికవడ్డీలకు అధిక అప్పులు చేస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 80 శాతం అప్పులను ఈ 18 నెలల్లోనే చేసేశారు.
ఈ వేగంతో మరి మిగిలిన 42 నెలల్లో చంద్రబాబు చేసే అప్పులు ఎక్కడకు చేరుకుంటాయో.. వడ్డీలు ఏపీ పరిస్థితిని ఏ మేరకు దిగజారుస్థాయో ఊహలకందడం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అస్థవ్యస్ధ ఆర్దిక నిర్వహణతో రాష్ట్ర ఆదాయ వృద్ధి దారుణంగా క్షీణిస్తోంది. మరోపక్క మూలధన వ్యయం తగ్గిపోతోంది. రెవెన్యూ వ్యయానికి కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇలానే ఉంటే ఏపీ పరిస్థితి శ్రీలంక ఏమో గానీ ఆఫ్రికన్ దేశమైన సౌత్ సూడాన్ కన్నా దిగజారడం ఖాయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
నాడు గగ్గోలు పెట్టి...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాచురేషన్ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసింది. నాడు మద్యం ఆదాయంపై చేసిన అప్పులపై చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. అంతే కాకుండా కేంద్ర ఆర్థికశాఖకు, ఆర్‌బీఐకి, సెబీకి ఫిర్యాదులు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ ఎల్లోమీడియాలో ఎన్నో కథనాలు వండివార్చారు.. ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు.
మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. ఇపుడు చంద్రబాబు చేసిందేమిటి? అదే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అధికవడ్డీకి రూ.5,490 కోట్లు అప్పు చేశారు. ఆ ఆదాయం తగ్గకుండా ఉండడం కోసమే ఊరూ వాడా బెల్ట్ షాపులు, పర్మిట్ రూములతో జనాన్ని మద్యం మత్తులో ముంచేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో అప్పుల శాతం పెరుగుతోంది
రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌కు వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం జీఎస్‌డీపీలో అప్పుల శాతం 33.1 శాతమే ఉండగా, 2024–25లో 34.3 శాతానికి, 2025–26లో 34.7 శాతానికి పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్సప్ వెహికిల్స్ (ఎస్‌పీవీలు) ద్వారా చేసే అప్పులను ఆయా రాష్ట్రాలు స్వయంగా చేసిన అప్పుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వరంగ సంస్థల ద్వారా చేసే అప్పులకు అసలు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తారని, ఈ నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి లోబడే ఆ అప్పులు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి మించి గతంలో అప్పులు చేస్తే ఆ రుణాలను తదుపరి సంవత్సరాల రుణ పరిమితిలో తగ్గించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) ప్రకారం రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.


