టెండర్ దరఖాస్తుల స్వీకరణ విషయంలో ఏపీసీపీడీసీఎల్ అధికారుల వింత పోకడ
50 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన ఏపీసీపీడీసీఎల్
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో టెండర్ దక్కాలంటే ప్రభుత్వ పెద్దల అండ ఉండాలి. కనీసం టెండర్లు వేయాలన్నా కూడా వారు సిఫార్సు చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనధికారికంగా అమలు జరుగుతున్న కఠిన నిబంధనలు ఇవి. దీనికి మంగళవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) కార్యాలయంలో జరిగిన ఉదంతమే నిదర్శనం. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కటి 33/11కేవీ సామర్థ్యంతో 50 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆరు ప్యాకేజీలుగా రూ.230 కోట్లతో టెండర్లను గత నెల 20న ఆహ్వానించారు.
ఈ నెల 16వ తేదీ(మంగళవారం) సాయంత్రం 4 గంటల్లోపు ఆన్‌లైన్‌లో టెండర్ దరఖాస్తు సమరి్పంచడంతోపాటు ఆ దరఖాస్తు పత్రాలను నేరుగా విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అందజేయాలని నిబంధన విధించారు. దానికి తగ్గట్టుగానే కొందరు కాంట్రాక్టర్లు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలతో మంగళవారం విజయవాడలోని కార్యాలయానికి వచ్చారు. కానీ, ఇక్కడ వారికి వింత అనుభవం ఎదురైంది. టెండర్ పత్రాలను స్వీకరించేందుకు అధికారులు నిరాకరించారు. ఎందుకు తీసుకోరని నిలదీస్తే... అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు.
ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారి దరఖాస్తులనే తీసుకుంటున్నారని, మిగతావారివి తీసుకోవద్దన్నారని అక్కడి సిబ్బంది కాంట్రాక్టర్లకు బదులిచ్చారు. దీంతో ఇదెక్కడి అన్యాయమంటూ కాంట్రాక్టర్లు మీడియాను ఆశ్రయించారు. పలు మీడియా సంస్థల ప్రతినిధులకు ఫోన్లు చేసి ఈ విషయం తెలియజేశారు. అదంతా చూసిన అధికారులు విషయం పెద్దదయ్యేలా ఉందని భావించి, టెండర్ దరఖాస్తులను గడువు ముగిసిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు తీసుకున్నారు. ఇక వాటిని చెత్తబుట్టలో పడేస్తారా? లేక పరిశీలిస్తారా? అనేది వారి ఇష్టం.
మంత్రి పేషీలో ముందే నిర్ణయం
రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను మొత్తం కొందరికి అనుకూలంగానే నిర్వహించడమనేది కొన్ని నెలులుగా జరుగుతోంది. టెండర్ నిబంధనలు రూపొందించడం దగ్గరే అసలు పనంతా పూర్తవుతోంది. ఏ సంస్థలు టెండర్లలో పాల్గొనాలి, ఎవరికి టెండర్ దక్కాలి అనేది మంత్రి పేషీలోనే నిర్ణయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నిబంధనలు రూపొందిస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయితే సబ్ స్టేషన్ల టెండర్ ప్రక్రియలో అధికారులు మరో అడుగు ముందుకేశారు.
ఎప్పుడో తీసేసిన నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చారు. నిజానికి ఆన్‌లైన్‌లో టెండర్ దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆఫ్‌లైన్‌లో దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు ఎటువంటి కచ్చితమైన గడువు ఉండదు. కానీ, ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు తప్పనిసరిగా గడువులోగా ఇవ్వాలంటూ షరతు పెట్టారు. దానికి కూడా కాంట్రాక్టర్లు అంగీకరించి దరఖాస్తులు తీసుకుని వెళితే, వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించి హైడ్రామా నడిపారు.
ప్రతిసారీ ఇదే విధంగా ఏదో ఒక వంక పెట్టి టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, ఒకవేళ టెండర్ వేసినా అర్హత సాధించకుండా చేస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పిన కొన్ని సంస్థలకే టెండర్లు ఇస్తున్నారని, దీనివెనుక భారీ మొత్తంలో సొమ్ములు చేతులు మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయతి్నంచగా, ఆయన స్పందించలేదు.


