18 నెలల తర్వాత పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రికి నిధులు
ఆధునిక వసతులకు రూ.48 కోట్లు మంజూరు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలు
తిరుమల: వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రి ఆధునికీకరణకు ఎట్టకేలకు టీటీడీ కదిలింది. ఈ ఆస్పత్రిలో గత ఏడాది ఎన్నికలనాటికే 75 శాతం పనులు పూర్తయి, వినియోగానికి సిద్ధమైంది. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మిగిలిన వసతుల కల్పన పనులు నిలిపివేశారు. ఇది పూర్తయితే వైఎస్ జగన్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో పనులకు అడ్డుకట్ట వేశారు.
అయితే ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఈ ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాల కల్పనకు పాలక మండలి రూ.48 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ గోశాల నిర్మాణానికి కేటాయించిన 400 ఎకరాల భూమిలో 100 ఎకరాలను ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు అవసరమైన దివ్య వృక్షాలు పెంచేందుకు వినియోగించాలని ఈ సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో అంచెలంచెలుగా గోశాలకు మంగళం పాడినట్లేనని భావిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు..
» టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్లు, సిబ్బంది తదితర సౌకర్యాల కల్పనకు ఆమోదం.
» ముంబైలోని బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం
»దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన విధానం తేవాలని నిర్ణయం
అర్చకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు
టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఆమేరకు.. అర్చకులకు రూ.25,000 నుంచి రూ.45,000కు, పరిచారకులకు రూ.23,140 నుంచి రూ.30,000కు, పోటు వర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30,000కు ప్రసాదం డి్రస్టిబ్యూటర్లకు రూ.23,640 నుంచి రూ.30,000 కు పెంపు


