పల్లెంత తుళ్లింత కావాలిలె! | The festive atmosphere of Sankranthi has begun in the villages | Sakshi
Sakshi News home page

పల్లెంత తుళ్లింత కావాలిలె!

Dec 17 2025 5:01 AM | Updated on Dec 17 2025 5:01 AM

The festive atmosphere of Sankranthi has begun in the villages

ధనుర్మాసం ఉత్సవాలు ఆరంభం

గ్రామాల్లో ఇక సంక్రాంతి సందడి 

ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

ఆకట్టుకోనున్న రంగవల్లులు 

కోనసీమ ప్రత్యేకతగా ప్రభల ఉత్సవం 

దేశ విదేశాల నుంచి స్వగ్రామాలకు రానున్న తెలుగువారు 

ఆలమూరు/బిక్కవోలు: తెలుగు సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతి పండగకు పల్లె సీమలు ముస్తాబవుతున్నాయి. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశి, మూల కార్తీ రోజైన మంగళవారం మ«ధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు «ధనురాశిలో ప్రవేశించడంతో శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభమయ్యింది. 

గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనుర్మాసాన్ని నెల పట్టుట లేదా నెలగంట అంటారు. జనవరి 14న జరిగే భోగి పండగ వరకూ నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఉంటుంది. విష్ణాలయాల్లో ధనుర్మాస పూజలు చేసేందుకు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. కోనసీమ జిల్లా­లోని వివిధ గ్రామాల్లో ఉన్న విష్ణాలయాల్లోని దేవతామూర్తులు ప్రతి రోజూ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనివ్వనున్నారు. 

సంప్రదాయ కళల కోలాహలం సంక్రాంతి 
ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ కళల కోలాహలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట ఆడపడుచుల రంగు రంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలతో మేలుకొలుపు, సంప్రదాయ పిండివంటలతో లోగిళ్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, కోడి, ఎడ్ల పందేలను నిర్వహించేందుకు పల్లెలు సమాయత్తం అవుతున్నాయి. 

భోగి పండగను పురస్కరించుకుని చిన్నారులు ఆవు పేడను సేకరించి భోగి పిడకలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కొమ్మదాసులు, గంగిరెద్దుల వారు, కోయదాసులు వంటి కళాకారులు గ్రామాల్లో సందడి చేయనున్నారు. సంప్రదాయ కళలుగా భావిస్తున్న కోడిపందేలను పోలీసుల కళ్లు గప్పి ఏవిధంగా నిర్వహించాలనే ఆలోచనలో పందెం రాయుళ్లు ఉన్నారు. ఇప్పటికే పందెం కోళ్లను జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికాహారంతో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. 

పాకశాలలుగా పల్లె లోగిళ్లు 
సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లోని లోగిళ్లు పిండివంటల తయారు చేస్తూ పాకశాలలుగా మారనున్నాయి. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు తెలుగు సంప్రదాయ వంటకాలైన సున్నుండలు, గజ్జికాయలు, జంతికలు, గవ్వలు, పోకుండలు తయారు చేసేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు. 

రైతులకు పంట చేతికందడంతో సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతికి నూతన వ్రస్తాలు కొనుగోలు చేయడంతో పాటు తమ లోగిళ్లను సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవ్వనున్నారు. ఇతర దేశాల్లో కాని, రాష్ట్రాల్లో కాని నివసించే తెలుగు ప్రజలు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే విమానం, రైలు, బస్‌ టికెట్లు బుక్‌ అయిపోయాయి. 

పోటాపోటీగా ప్రభల ఉత్సవాలు 
సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కోనసీమలోని సుమారు 15 మండలాల్లో ప్రభల తీర్థ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏకాదశ రుద్రులుగా భావించే ప్రభల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. 

ఈ ప్రభలను పండగ మూడురోజుల పాటు ఊరేగించి పొలిమేరలు దాటిస్తే ఆ గ్రామానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గ్రామాలు, పట్టణాల్లో పోటీ పడి ప్రభల ఉత్సవాలను జరుపుతున్నారు. బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, బ్యాండుమేళాలు వంటివి ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.  
గొబ్బెమ్మకు పూజలు 
పండగ నెల ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యన గొబ్బెమ్మను పెట్టి పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలను గోదాదేవి, లక్ష్మీ దేవి, గౌరీ మాతగా భావిస్తారు. గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి గుమ్మడి, తంగేడు, గురుగు పూలు, పసుపు కుంకుమ సమర్పించి పూజిస్తారు. ధనుర్మాసం పొడవునా గొబ్బెమ్మను పూజించడం ఆనవాయితీ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement