సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ వీఆర్‌ఏ సంఘాల జేఏసీ డిమాండ్
మంగళగిరి టౌన్: గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ వీఆర్‌ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 700 మందికి పైగా వీఆర్‌ఏలు పాల్గొన్నారు. గంటల తరబడి ఎండలో కూర్చున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
జేఏసీ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్‌ఏలందరికీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 వేల మంది వీఆర్‌ఏలకు గౌరవ వేతనం ఇచ్చి ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. సమస్యలను పరిష్కరించక పోగా నైట్ డ్యూటీలు, రీ సర్వేలు వంటి అదనపు పనులు చేయించుకుంటూ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
అర్హత ఉన్న వీఆర్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. చనిపోయిన వీఆర్‌ఏల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 30లోపు ఈ సమస్యలను పరిష్కరించని పక్షంలో మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సీసీఎల్‌ఏ అధికారికి వినతిపత్రమిచ్చారు.


