కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం
నోటిఫికేషన్, ప్రిలిమినరీ పరీక్ష జరిగింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే
నాడు కోర్టు కేసులతో నియామక ప్రక్రియను అడ్డుకుంది టీడీపీయే
నేడు తానే పోస్టింగులు ఇస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్
సాక్షి, అమరావతి: క్రెడిట్ చోరీలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రికార్డులు తానే తిరగరాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను తమ ప్రభుత్వం చేసినవిగా చెప్పుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటును ‘గూగుల్’ ముసుగులో తన ఘనతగా చెప్పుకునేందుకు ఆపసోపాలుపడిన చంద్రబాబు అభాసుపాలయ్యారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట మంగళవారం ప్రచారార్భాటంతో కనికట్టు చేయడం పోలీసు వర్గాలనే విస్మయపరుస్తోంది. ఈ ప్రక్రియలో అసలు వాస్తవాలివీ..
2022లోనే నోటిఫికేషన్..
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత 2022లో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలూ నిర్వహించి 411 ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,520 మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022, నవంబరులో నోటిఫికేషన్ జారీచేసింది.
ఆ పోస్టులకు మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023, జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష ఫలితాలను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారు.

కోర్టు కేసులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను అడ్డుకున్న టీడీపీ..
అయితే, ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ దురుద్దేశంతో అడ్డుకుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ, టీడీపీ నేతలు తమ వర్గీయుల ద్వారా న్యాయస్థానాల్లో 36 పిటిషన్లు వేయించారు. దాదాపు ఏడాదిపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తమ వర్గీయుల చేత ఆ కేసులన్నీ ఉపసంహరింపజేయడం గమనార్హం. దీంతో రాష్ట్ర పోలీసు నియామక మండలి దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించి 5,757 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
చంద్రబాబు హైడ్రామా..
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఇప్పుడు తన ఘనతగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట తెగ హడావుడి చేశారు. వాస్తవానికి.. కానిస్టేబుళ్లకు రాష్ట్రంలోని వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లలో నియామక పత్రాలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
కానీ, ఈ పోస్టుల భర్తీ తన ఘనతగా చెప్పుకునేందుకు.. అలాగే, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఓ ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 5757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం కార్యాక్రమాన్ని మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్‌లో మంగళవారం నిర్వహించారు. అంతేకాదు.. ఎంపికైన ఒక్కో కానిస్టేబుల్ అభ్యర్థి తనతో కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులను తీసుకురావాలని మెలిక పెట్టారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం తరలించింది.
అంతమందితో సమావేశం నిర్వహించి తన సొంత డబ్బా కొట్టుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. అంటే.. శ్రీకాకుళం, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఎంపికైన అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు వ్యయ ప్రయాసలు భరించి మంగళగిరి రావాలని హుకుం జారీచేశారు.
నిబంధనలకు విరుద్ధంగా..
అయితే, వీరు ఇంకా విధుల్లో చేరకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీరికి వారెంట్ జారీచేసి ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చింది. ఈ బాధ్యతలను జిల్లాల ఎస్పీలు పర్యవేక్షించారు. నిజానికి.. పోలీసు, రెవెన్యూ తదితర కీలక శాఖలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఈ కార్యక్రమాన్ని ఫక్తు పార్టీ కార్యక్రమంగా మార్చేసింది.
పైగా.. ఎంపికైన అభ్యర్థులతో జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంలా చేయడమేంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.


