ముంబై: ఢిల్లీ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత(విజిబిలిటీ) కారణంగా విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ఫలితంగా మంగళవారం మొత్తం 131 విమానాలను రద్దు చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారి తెలిపారు. రద్దయిన 131 విమానాలలో 52 బయలుదేరే విమానాలు కాగా, 79 వచ్చే విమానాలు ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో, ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రమైన ఢిల్లీలో, దట్టమైన పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత నెలకొంది. దీని ప్రభావం మొత్తం నెట్‌వర్క్‌లోని విమాన షెడ్యూల్‌పై పడింది. ఈ సంవత్సరం శీతాకాలం కోసం, ఏవియేషన్ రెగ్యులేటర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) డిసెంబర్ 10 నుండి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అధికారిక ‘పొగమంచు విండో’గా ప్రకటించింది.
ఈ అంతరాయాల కారణంగా, ఎయిర్‌లైన్ ఇండిగో తన నెట్‌వర్క్‌లో ఏకంగా 113 విమానాలను రద్దు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ వాతావరణం కారణంగా బుధవారం కూడా 42 విమానాలను నడపబోమని ఇండిగో ప్రకటించింది.


