ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా ప్రజలను కోరారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి మంజీందర్ సింగ్ మాట్లాడుతూ "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది.


