డిసెంబరు నెలలో తొలి పున్నమి వచ్చిందంటే చాలు.. గూడచి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలగపండ్లు రాశులు పోసి కనిపిస్తాయి. దైవ దర్శనం పూర్తి చేస్తున్న భక్తులందరూ ఈ రాశుల వద్దకు చేరి డజన్లకు డజన్లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గ తాలూలోని గూడచి వీరభద్రేశ్వర స్వామి జాతరకు హాజరైన వారందరూ స్వామివారి ప్రసాదంలా వెలగపండ్లు ఇళ్లకు తీసుకెళ్లడం వాడుక. అనాది కాలపు సంప్రదాయం. పౌర్ణమితో మొదలై ఐదు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరలో బెళగావితోపాటు పొరుగునే ఉన్న బాగల్‌కోట, విజయపుర, హావేరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూంటారు. జాతర ఐదవ రోజున ఆలయంలో జరిగే లక్ష దీపోత్సవం ఒక హైలైట్.
సాంప్రదాయికంగా ఈ జాతర జరిగేది ఐదు రోజులే అయినప్పటికీ పౌర్ణమి నుంచి తరువాతి అమావాస్య వరకూ భక్తుల రాకపోకలు జోరుగానే సాగుతూంటాయి. వచ్చిన వారిలో అత్యధికులు వెలగపండ్లను ప్రసాదంగా తీసుకెళ్లడమూ కద్దు. మనమంటే వెలగపండ్లు అని పిలుస్తున్నాం కూడా కర్ణాటకలో దీనికి బోలెడన్ని పేర్లు. బేల, బలవత్తే, దంతశఠ, కపిత్థ అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. ఇంగ్లీషులో ‘వుడ్ ఆపిల్’. వీరభద్రేశ్వర ఆలయమున్న రామదుర్గ ప్రాంతంలో బళువల అని పిలుస్తారు. ఈ పండ్లను తీసుకెళ్లడంతోనే జాతర పూర్తయినట్లు వీరి నమ్మకం. అందుకే ఈ జాతరకు వెలగపండ్ల జాతరని కూడా స్థానికులు పిలుస్తూంటారని ఈరణ్ణ కామన్నవర తెలిపారు.
లారీల కొద్దీ పంట..
వీరభద్రేశ్వర స్వామి ఆలయ జాతరకు లారీల కొద్దీ వెలగపండ్లు వస్తూంటాయి. ఈ ఏడాది సుమారు 15 లారీల వరకూ పండ్లు వచ్చినట్లు సమాచారం. ఏటా సుమారు యాభై మంది వరకూ వ్యాపారులు ఇక్కడ వెలగపండ్ల విక్రయాలు సాగిస్తూంటారు. వీటిని రాశులుగా పోసుకుని అమ్ముకునేందుకు, భక్తుల అవసరాల కోసం గ్రామపంచాయతీ, జాతర కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. జాతరకు వచ్చిన ఒక్కో కుటుంబం కనీసం ఐదారు డజన్ల వెలగపండ్లను ఖరీదు చేస్తాయని వ్యాపారి ద్యామణ్ణ నాగప్ప అమరగోళ తెలిపారు. మరి అన్ని పండ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే.. ఊళ్లో బంధు మిత్రులకు జాతర ప్రసాదంగా పంచుతారని సమాధానమిచ్చారు ఆయన. వెలగపండ్ల గుజ్జుకు బెల్లం కలిపి ఒక్కరోజు వదిలి తింటే ఆ రుచి అద్భుతం అని మనలో చాలామందికి తెలుసుకదా? ప్రసాదంగా పొందిన వారందరూ అంత మధురానుభూతి పొందాలన్నది ఈ సంప్రదాయం ఉద్దేశమేమో?
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామదుర్గం తాలూకాలో వెలగపండ్లు అందుబాటులో ఉండటం తక్కువ కావడం. హావేరీ, శిగ్గావి, హానగల్, గోందీ, అనవట్టి వంటి ప్రాంతాల్లో దొరికే పండ్లను వ్యాపారలు ఇక్కడకు తీసుకొస్తూంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధంలో మడివాళ మాచప్ప శరణరు సందర్శించిన సందర్భంలో ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది రోగాలపాలై ఉన్నారట. పోషకాలతో నిండిన వెలగపండ్లు తింటే మేలు జరుగుతుందని చెబితే ప్రజలు పట్టించుకోరని.. వీరభద్రేశ్వర ఆలయం.. జాతర వంటి ఏర్పాట్లు చేశారని ప్రతీతి. ప్రసాదంగా ఈ వెలగపండ్లు పంచడం కూడా అప్పుడే మొదలైందని చెబుతారు. అయితే ఈ కథకు సంబంధించి ఎక్కడ రాతపూర్వక ఆనవాళ్లయితే లేవు.
పోషకాల పుట్ట...
వాస్తవానికి వెలగపండ్లు పోషకాల పుట్ట. తీపి, పులుపు రుచులతో ఉండే ఈ పండులో విటమిన్-సీ, పొటాషియం, ఫాస్పరస్ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందని అంచనా. అంటే.. దైవ ప్రసాదం మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్యాన్నీ ఇస్తోందన్నమాట.
- గానధళు శ్రీకంఠ, ప్రజావాణి సౌజన్యంతో


