సాక్షి, తాడేపల్లి: సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసు అని కురుబ సంఘం నాయకులు కీర్తించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ కురుబ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురుబ నాయకులు పాల్గొన్నారు.
భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.

భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సామాజిక అంతరాలు తొలగించేలా పాలన అందించారని కొనియాడారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహంతో పాటు ఆయన పేరుతో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కురుబ సోదరులు కోరగా ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారికి హామీ ఇచ్చారు.
గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మిక వేత్త భక్త కనకదాసు కుల దురహంకారంపై సాహిత్యమనే ఆయుధంతో పోరాడి సామాజిక విప్లవం తీసుకొచ్చారు. భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సైతం కులదురహంకారంపై పోరాడి తన పాలన ద్వారా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. కులాల మధ్య అంతరాలు తొలగించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించారు. పార్టీ, ప్రభుత్వంలో ఉన్నత పదవులు కల్పించి ముందుకు నడిపించారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడైన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది.
రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణం చేయాలని కురుబ సోదరులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇస్తున్నాను. భక్త కనకదాసు స్ఫూర్తితో మాజీ సీఎం వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషిచేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.


