తహసీల్దార్‌ను చుట్టుముట్టిన గిరిజనులు
ఏలూరు జిల్లా ఇనుమూరులో భగ్గుమన్న భూ వివాదం
అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన గిరిజనులు
పోలీసులతో తోపులాట.. పలువురికి గాయాలు
రాత్రి సమయానికి నచ్చజెప్పి బయటపడ్డ తహసీల్దార్
రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో సర్వే నంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని, చాలాకాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ, యాండ్రప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికూటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్డీవో ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పీవీ చలపతిరావు వీఆర్వోలు, సర్వేయర్లు, పోలీసులతో కలిసి బైక్‌లపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్‌తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్, మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారుల మోటార్‌సైకిళ్లలో గాలి తీసేశారు. ఓ వీఆర్‌వో బైక్ అద్దాలను పగులగొట్టారు.
పంటను పాడుచేసినందుకు సమాధానం చెప్పాలంటూ... తహసీల్దార్ కంట్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక తహసీల్దార్‌తో పాటు, ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు, ఆరుగురు కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు.
కాగా, బైక్‌లను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమామిడిగూడెం వచ్చారు. బుట్టాయగూడెంకు చెందిన రైతు తాటినాడ హరిబాబుకు ఫోన్ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్‌ను రాత్రి 7:30కు తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


