చేనేతకు.. లేదు చేయూత
నేతన్నల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు
ఏడాదిన్నర కాలంలో రూపాయి విదల్చని వైనం
పెరిగిన ముడిపట్టు ధరలు, పట్టుచీరకు దక్కని మద్దతు
అప్పుల బాధలతో ఆత్మహత్యలకు తెగిస్తున్న నేతన్నలు
ఉపాధి లేక వలసలు వెళ్తున్న చేనేత కార్మికులు
గతంలో ‘నేతన్న నేస్తం’తో చేనేతల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్ సర్కార్
ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక చేయూత
నాటి సంక్షేమ పాలనను తలచుకుంటున్న చేనేతలు
ఒక్కోపోగును కలిపి మిరుమిట్లు గొలిపే పట్టుచీరలను నేసే వారి బతుకు మాత్రం అంధకారంలో మగ్గిపోతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి కూడా గిట్టుబాటు కాక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ముడి పట్టు ధరలు అమాంతం పెరిగినా... చీర ధర మాత్రం పైకి రానంటోంది. వ్యయం పెరిగి..ఆదాయం తగ్గి అప్పుల పాలైన నేతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు తెగిస్తున్నా... చంద్రబాబు సర్కార్ పైసా సాయం విదల్చడం లేదు.
ధర్మవరం: సత్యసాయి జిల్లాలో ధర్మవరం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, గోరంట్ల, చిలమత్తూరు తదితర ప్రాంతాలలో 24 వేలకుపైగా చేనేత మగ్గాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.20 లక్షల మందికిపైగా చేనేత కార్మికులు, అను బంధ రంగాలవారు చేనేతపై ఆధారపడి పని చేస్తు న్నారు. ధర్మవరం పట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డిజైనర్లూ ఉన్నారు. వీరందరికీ మగ్గం పని తప్ప మరొకటి తెలియదు. అందుకే నష్టమైనా..కష్టమైనా మగ్గంపైనే జీవనం సాగిస్తున్నారు.
నాడు వెలుగులు..
గత పాలకుల నిర్లక్ష్యంతో చేనేత రంగం కుదేలైంది. ఆర్థిక చేయూత లేక చాలామంది నేతన్నలు మగ్గం పక్కనపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కానీ రాష్ర్టంలో జగన్ సర్కార్ కొలువుదీరాక పరిస్థితి పూర్తిగా మారింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత రంగానికి ప్రాణం పోశారు. 2019 డిసెంబర్ 21న తన జన్మదినం రోజున ధర్మవరంలోనే ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు ముడిపట్టురాయితీని ఒకేసారి ఖాతాలో జమ చేసి ఆదుకున్నారు.
ఇలా ఐదేళ్ల పాటు సాయం అందించారు. కరోనావంటి కష్టకాలంలోనూ రెండు నెలలు ముందుగానే ‘నేతన్న నేస్తం’ నిధులు కార్మికులకు ఖాతాలలో జమ చేశారు. ఇలా ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తం ఉన్న 83వేల మంది కార్మికులకు రూ.960 కోట్ల ఆర్థిక సాయం అందింది. ఈ క్రమంలో జిల్లాలోని 16వేల మంది చేనేత కార్మికులకు రూ.178 కోట్లు దక్కాయి. ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే 12 వేల మందికిపైగా చేనేత కార్మికులకు రూ.136 కోట్ల మేర చేయూత లభించింది.
గతంలో ఎవరూ చేయనంత సాయం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. దీంతో చేనేతలు మగ్గాలను అభివృద్ధి చేసుకుని నూతన డిజైన్లతో మార్కెట్‌లో తమ సత్తా చాటారు. తద్వారా ఆదాయమూ పెరిగి ఆనందంగా ఉండేవారు. పిల్లలనూ బాగా చదివించుకున్నారు.
భారీగా పెరిగిన ముడిపట్టు ధరలు..
రాష్ర్టంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరగానే చేతనల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నేతన్న నేస్తం పథకానికి మంగళం పాడిన సీఎం చంద్రబాబు...ఏడాదిన్నర కాలంలో రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. మరోవైపు పట్టుచీరలకు ఉపయోగించే ముడిపట్టు ధరలు (వార్పు, రేషం, జరీ) ధరలు ఏడాదిన్నర కాలంలో 30 శాతానికి పైగా పెరిగాయి. అప్పట్లో కిలో రేషం రూ. 4 వేలు, వార్పు కిలో రూ.4,500 ధర ఉండగా... ప్రస్తుతం కిలో రేషం రూ.6 వేలు, కిలో వార్పు రూ.6,500లకు చేరింది.
చీర తయారీకి వాడే జరీ (మార్కు రకం) సైతం గతంలో రూ.600 ఉండగా... ప్రస్తుతం రూ.800లకు పెరిగింది. దీంతో ప్రతి చీరపైన 30 శాతం పెట్టుబడి వ్యయం పెరిగింది. మరోవైపు పట్టుచీరల ధరలు మాత్రం పెరగలేదు. దీంతో చేనేత కార్మికులకు కూలి కూడా గిట్టుబాటు కాక అప్పుల పాలై మగ్గానికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే హృదయ విదార కరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
పైసా సాయం విదల్చని చంద్రబాబు సర్కార్
చంద్రబాబు సర్కార్ చేనేతలకు పైసా సాయం విదల్చలేదు. ఈ ఏడాది చేనేత దినోత్సవం రోజున ‘నేతన్న నేస్తం’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికి ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు ముడిపట్టు ధరలు పెరగడం...పట్టుచీరల ధరలు మాత్రం అంతంతమాత్రంగానే ఉండటంతో నేతన్నలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. చాలా మంది కార్మికులు మగ్గాలు పక్కన పెట్టారు. మరికొందరు పొట్టచేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఎప్పుడూ లేవని పలువురు నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు కావడం లేదు
ముడిపట్టు ధరలు విపరీతంగా పెరిగాయి. రోజంతా మగ్గం నేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు. గతంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా రూ.24 వేల సాయం అందేది. ఆ డబ్బుతో మగ్గంను అభివృద్ధి చేసుకుని కొత్త డిజైన్‌లు నేయడం ద్వారా కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుతం పథకం నిలిపి వేయడంతో మా అవస్థ వర్ణనాతీతంగా ఉంది. –గాజుల సోము, చేనేత కార్మికుడు, ధర్మవరం.
మనుగడ ప్రశ్నార్థకమే
జగనన్న సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఉనికి కోల్పోతున్న చేనేత వ్యవస్థకు ప్రాణం పోశారు. ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా రూ.24 వేలు అందజేశారు. ఆ సాయంతో చేనేతలు ఎంతో అభివృద్ధి చెందారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేతలను పూర్తిగా విస్మరించింది. ముడిపట్టు ధరలు పెరిగి నష్టాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదు.
ఉపాధి లేక చేనేత కార్మికులు కేరళ వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కొంతమంది అప్పుల బాధను తాళలేక మగ్గానికే ఉరివేసుకునే దుర్భర పరిస్థితులు జిల్లాలో కనపడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చేనేత మనుగడ ప్రశ్నార్థకమే. – గుండా ఈశ్వరయ్య, చేనేత సంఘం నాయకుడు, ధర్మవరం


