సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ. నారాయణమూర్తి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలనుద్దేశంచి పార్టీ నేతలు మాట్లాడారు.

తానేటి వనిత మాట్లాడుతూ.. పేదలను ప్రేమించడంతో పాటు వారికి సహాయం చేయాలన్న ప్రభువు క్రీస్తు సిద్ధాంతాలను కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టే.. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు సహకరించకపోయినా, కరోనా వంటి విపత్తులోనూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండగ. క్రీస్తు జననానికి మానవాళిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవాళ 2025లో ఉన్నామంటే.. దాని కొలమానం క్రీస్తు శకం అని అంటాం. అంటే ఆయన ఉద్భవించిన నాటి నుంచి నేటికి 2500 సంవత్సరాలు కింద లెక్క. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవడానికి గుర్తించబడిన.. క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో, గొప్పదో తెలుసుకోవచ్చు.
మన దేశం లౌకిక వాద దేశం. ఇక్కడ సర్వమతాలు సహజీవనం చేస్తున్న దేశం. ఎవరైనా పరమతాన్ని గౌరవిస్తే.. అప్పుడే మన మతాన్ని గౌరవించగలుగుతాం. అన్ని మతాలు సహజీవనం చేస్తున్న చక్కని దేశం మనది. గుంటూరుకు సంబంధించి చాలా కాలం క్రితమే క్రిస్టియానిటీ మొదట విద్యాలయాలు, వైద్యాలయాలను తీసుకొచ్చింది. మానవ సేవ చేయడమే దైవ సేవ చేయడంగా భావించిన క్రిస్టియానిటీ అనేక కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్‌సీపీ తరపున రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా... సమాజానికి సంబంధించి ఆయన బోధనలు, ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్ధాయిగా ఉంటాయి. తోటివారిని ప్రేమించడం, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, అవసరమైన చోట్ల త్యాగాలకు సిద్ధం కావడం ఇలా బైబిల్ లో అంశాలన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మనిషి ప్రతి మాటలో మానవత్వం, ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో సాయం చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ సమాజంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మన ప్రియతమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో మనందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ మందుకు సాగాలని, ఆ ప్రభువు ఏసుక్రీస్తు చెప్పినట్లు కోరుకుంటున్నాను


