సింధు, అనూష (ఫైల్), కూతుళ్లను కాలువలో తోసిన తండ్రి కల్లప్ప (ఇన్‌సెట్‌లో)
ఇద్దరు కూతుళ్లను కాలువలోకి తోసిన తండ్రి
రెండు రోజుల తర్వాత బయటపడ్డ పెద్ద కుమార్తె మృతదేహం
చిన్న కుమార్తె జాడ కోసం కొనసాగుతున్న గాలింపు
బొమ్మనహాళ్: తండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తానని ఇద్దరినీ కాలువలో తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప, కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కుమార్తెలు సింధు (11), అనూష (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలను కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు.
కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు తీయగా.. కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు.
మంగళవారం ఉదయమైనా పిల్లలు రాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ వద్ద ఎల్లెల్సీ కాలువలో తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీలోకి తోసేశానని మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్లెల్సీవద్ద గుర్తించి బయటకు తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు.


