పులివెందులలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
టీడీపీ అరాచకాల బాధితులకు వైఎస్ జగన్ భరోసా
పులివెందులలో కార్యకర్తలు, ప్రజలతో మమేకం
యోగక్షేమాలు విచారిస్తూ.. అందరి కష్టాలు వింటూ..
బాధితులకు నేనున్నానంటూ ఊరడింపు
జగన్‌ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన జనం
సాక్షి కడప ప్రతినిధి/పులివెందుల: రాబోయే రోజులు మనవేనని, ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను కలిసి సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి కష్టం విని.. నేనున్నానని ధైర్యం చెప్పి ఊరడించారు. మంగళవారం ఆయన తన సొంత నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్‌తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు.
వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది.
నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
వైఎస్సార్‌టీఏ నూతన డైరీ, క్యాలెండర్లను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్‌టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించలేదని, పీఆర్‌సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సు«ధ, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, కమలాపురం ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు.


